మహారాష్ట్ర మంత్రుల్లో 75 శాతం మంది నేరచరితులే
మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే మంత్రి వర్గంలో 75 శాతం మంది నేరచరితులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఎడిఆర్) తన నివేదికలో పేర్కొంది. అందులోనూ 65 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయినట్టు ఆ నివేదిక తెలిపింది.
మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడి (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) ప్రభుత్వాన్ని బిజెపి ప్రోత్సాహంతో పడగొట్టి ఆ పార్టీ మద్దతుతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన మంత్రి మండలి ఏర్పాటు చేశారు. వారిలో 75 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఎడిఆర్) తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా 20 మంది మంత్రులు ఉండగా, వారిలో 15 మంది తమ ఎన్నికల అఫిడవిట్‌లలో తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని నివేదిక తెలిపింది. ఇటీవల షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రులు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. 15 (75 శాతం) మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులు, 13 (65 శాతం) మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయినట్టు పేర్కొన్నారు.
ఇకపోతే మంత్రులంతా కోటీశ్వరులే కాగా వారి సగటు ఆస్తుల విలువ రూ.47.45 కోట్లు అని ఏడిఆర్ నివేదిక వెల్లడించింది. మలబార్ హిల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోధా రూ.441.65 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతుడు కాగా పైఠాన్ నియోజకవర్గానికి చెందిన మంత్రి భూమారే సందీపన్‌రావు ఆశారాం అతి తక్కువగా రూ. 2.92 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారని ఏడీఆర్ తెలిపింది. మంత్రిమండలిలో ఒక్క మహిళకూ ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం.
ఎనిమిది మంది మంత్రులు తమ విద్యార్హత 10నుంచి 12వ తరగతి చదువుకున్నట్టు ప్రకటించగా, 11 మంది (55 శాతం) గ్రాడ్యుయేట్, అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారని ప్రకటించారు. ఒక మంత్రి డిప్లొమా చదివినట్టు తెలిపారు.
బిజెపితో పొత్తు పెట్టుకోవాలన్న డిమాండ్ తో ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఏక్ నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టి బిజెపి మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఉపముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పడు శివసేన పార్టీ అధికారిక చిహ్నంపై షిండే, ఠాక్రే న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే..