ఝార్ఖండ్‌లో 67.59% మహారాష్ట్రలో 58.22% ఓటింగ్ నమోదు
ఝార్ఖండ్‌లో రెండో విడత మహారాష్ట్రలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఝార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలు ముగిసే సరికి 67.59 శాతం పోలింగ్ నమోదైందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ నేహా అరోరా పేర్కొన్నారు.నవంబర్ 13న తొలి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా 38 స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహించారు. ముఖ్యంగా ఇండియా కూటమిఎన్డీఏ కూటమి అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఝార్ఖండ్‌లో పోలింగ్ శాతం 2.75కు పెరిగింది. మహారాష్ట్రలో 58.22% ఓటింగ్ నమోదైంది. మహా ఎన్నికల్లో బాలీవుడ్ తారలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
మాధురీ దీక్షిత్, రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ, అర్జున్ కపూర్, ప్రేమ్ చోప్రా, సింగర్ కైలాశ్ ఖేర్, సునీల్ శెట్టి, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్, పూనమ్ దిల్లాన్, జునైద్ ఖాన్, జావెద్ అక్తర్, మనీశ్ మల్హోత్ర, సింగర్ శంకర్ మహదేవన్, డైరెక్టర్ రోహిత్ శెట్టి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సైతం తన కుమారులు, కోడలితో కలిసి ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.