ఉత్తరాది వరదలు.. 145మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకూ 636 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 1,128 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 91మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరాదిన వారం రోజులుగా కొనసాగిన జలవిలయానికి 145మంది బలయ్యారు. ఇప్పటి వరకూ అధికారిక లెక్కలివి. కొండచెరియలు విరిగిపడటం, వాహనాలు వరదల్లో కొట్టుకుపోవడం, ఇళ్లు కూలిన ఘటనల్లో వారంతా చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరదల కారణంగా నష్టపోయినట్టు తేలింది. ప్రాణ నష్టం కూడా హిమాచల్ ప్రదేశ్ లోనే ఎక్కువగా జరిగింది. ఆ రాష్ట్రానికి చెందిన 91మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. యూపీలో 14మంది, హర్యాణాలో 16మంది, పంజాబ్ లో 11మంది, ఉత్తరాఖండ్ లో 16మంది వరదల వల్ల చనిపోయారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకూ 636 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 1,128 పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 1,110 రోడ్లు బ్లాక్ అయ్యాయని ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తెలిపింది. వర్షాలు, వరదల కారణంగా దాదాపు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీకి భారీ నష్టం..
బియాస్ నదీ ప్రవాహంతో హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరిగింది. ఇప్పుడు యమునా ప్రవాహంతో ఢిల్లీ ఇబ్బంది పడుతోంది. ఢిల్లీలో వరదలకు భారీగా ఆస్తినష్టం జరిగింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బాధితులు పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. నష్టం అంచనా లెక్కలు మరికొన్ని రోజుల్లో అధికారికంగా బయటకొస్తాయి. రుతుపవనాల కారణంగా మరికొన్ని రోజులపాటు ఉత్తరాదిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్ కి కూడా ముప్పు పొంచి ఉందని తెలిపింది.