విచారణకు ముందు ఎక్కువ కాలం జైల్లో ఉంచడం సరికాదు.. – సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో పలువురు ప్రముఖులు అరెస్టయిన విషయం తెలిసిందే. వారిలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఇద్దరు సీనియర్ ఆప్ సభ్యులు కూడా ఉన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా గత 13 నెలలుగా జైలులోనే ఉన్న పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రతినిధి బినోయ్ బాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థల వ్యవహార శైలిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచడం సరైన చర్య కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నిందితులపై ఈడీ, సీబీఐ చేసిన ఆరోపణల మధ్య వ్యత్యాసం ఉందని, ఈ విచారణ ఎలా సాగుతుందో తెలియడం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. బినోయ్ బాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే 13 నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సుప్రీంకోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో లేవనెత్తిన అంశాల ఆధారంగా ధర్మాసనం బినోయ్‌బాబుకు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ మద్యం కేసులో పలువురు ప్రముఖులు అరెస్టయిన విషయం తెలిసిందే. వారిలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఇద్దరు సీనియర్ ఆప్ సభ్యులు కూడా ఉన్నారు. సిసోడియా ఫిబ్రవరి నుంచి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అక్టోబర్ నుంచి జైలులో ఉన్నారు. అక్టోబర్ 30న మనీష్ సిసోడియా బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హోల్‌సేల్ మద్యం డీలర్‌లకు రూ.338 కోట్ల ‘విండ్‌ఫాల్ గెయిన్’లను సులభతరం చేయడంలో ఆయనపై వచ్చిన అభియోగాలు ‘తాత్కాలికంగా‘ సాక్ష్యాధారాలతో సమర్థించబడుతున్నాయని న్యాయస్థానం పేర్కొంది. సిసోడియా గత వారం కోర్టును ఆశ్రయించి తన ఉత్తర్వులను సమీక్షించాలని కోరారు.