ట్రక్కు బీభత్సం.. 10 మంది మృతి.. 20 మందికి గాయాలు
భారీ ట్రక్కు మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో ముంబై - ఆగ్రా హైవేపై ఈ బీభత్సం సృష్టించింది. పలస్నేర్ గ్రామ సమీపంలోని ఒక బస్టాపు వద్దకు చేరుకోగానే ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
మంగళవారం ఉదయం భారీ ట్రక్కు బీభత్సం సృష్టించింది. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వాహనం అదుపుతప్పి రెండు బైక్‌లు, కారు, మరో కంటైనర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా, 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ నుంచి ధులే వెళ్తున్న భారీ ట్రక్కు మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో ముంబై - ఆగ్రా హైవేపై ఈ బీభత్సం సృష్టించింది. పలస్నేర్ గ్రామ సమీపంలోని ఒక బస్టాపు వద్దకు చేరుకోగానే ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ ట్రక్కును నియంత్రించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
రద్దీగా ఉన్న ప్రాంతం కావడం, ఒక్కసారిగా ట్రక్కు దూసుకురావడంతో జనం తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.