వారాహి అసలు రోడ్డెక్కుతుందా?
పార్టీ వర్గాలు చెప్పిన ప్రకారం వారాహి ఎప్పుడో రోడ్డెక్కాల్సింది. కానీ ఇంతవరకు దాని గురించిన సమాచారమే ఎవరికీ లేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే సినిమా షూటింగులే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేతిలో ఇప్పుడు అరడజన్ సినిమాలున్నాయట.
ఇప్పుడు ఇదే అనుమానం అందరిలోనూ పెరిగిపోతోంది. ఎంతో ముచ్చటపడి తయారు చేయించుకున్న ఎన్నికల ప్రచార రథం వారాహి ఇంకా ఎప్పుడు రోడ్డెక్కేది అని జనసేన నేతలు మాట్లాడుకుంటున్నారు. పార్టీ వర్గాలు చెప్పిన ప్రకారం వారాహి ఎప్పుడో రోడ్డెక్కాల్సింది. కానీ ఇంతవరకు దాని గురించిన సమాచారమే ఎవరికీ లేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే సినిమా షూటింగులే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేతిలో ఇప్పుడు అరడజన్ సినిమాలున్నాయట. ఇవన్నీ షూటింగులు పూర్తిచేసుకోవటానికి తక్కువలో తక్కువ రెండేళ్ళుపడుతుంది.
సీన్ కట్ చేస్తే ఏపీలో షెడ్యూల్ ఎన్నికలకు 14 నెలలుంది. తెలంగాణలో షెడ్యూల్ ఎన్నికలకు ఉన్నది 10 మాసాలే. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లు తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటే హఠాత్తుగా వచ్చేస్తాయి. ఒకవైపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జిల్లాలు తిరిగేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ టూర్ల మీద టూర్లు వేస్తున్నారు. పాదయాత్రలని, బస్సుయాత్రలని జనాల్లోనే తిరుగుతున్నారు. ప్రధాన పార్టీలే ఏదోపేరుతో జనాల్లో తిరుగుతున్నపుడు పవన్ ఏం చేస్తున్నారు?
వచ్చే ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పవన్ అనుకుంటున్నారట. ఎందుకంటే ఆ మధ్య పవన్ మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేసినా 30 నియోజకవర్గాల్లో గెలిచేంత సత్తా జనసేనకు ఉందన్నారు. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో తెలియకపోయినా పోటీ అయితే కచ్చితంగా చేస్తారనే అనుకుంటున్నారు. మరీ నేపథ్యంలో పవన్ ఎప్పుడు ప్రచారం మొదలుపెడతారు? వారాహి ఎప్పుడు రోడ్డెక్కుతుంది?
తన వారాహికి ఎవరు అడ్డుపడతారో చూస్తానని హూంకరించారు. ఎవరు అడ్డుపడినా వారాహి తొక్కుకుంటూ వెళ్ళిపోతుందని హెచ్చరించారు. ఎవరో అడ్డుపడాల్సిన అవసరమే లేదు తానే వారాహిని బయటకు తీసే ఉద్దేశంలో లేరేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. షూటింగుల బిజీ కారణంగానే పవన్ పార్టీ మీటింగులు కూడా పెట్టడంలేదట. పవన్ ఆలోచన చూస్తుంటే ఎన్నికల ప్రకటనకు కొద్దిరోజులు ముందు మాత్రమే వారాహిని బయటకు తీసేట్లున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రచారం మొదలుపెట్టడమంటే ఏదో మొక్కుబడి వ్యవహారంలాగ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. వారాహికి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేయించిన తర్వాత కూడా షెడ్డులోనే పెట్టేశారంటే ఏమిటర్థం?