అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు
మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని మఫర్ అపార్ట్‌మెంట్ లిఫ్టులో అర్నవ్ అనే ఐదు సంవత్సరాల బాలుడు ఇరుక్కున్నాడు.
హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఆరేళ్ల బాలుడు ఇరుక్కుపోయిన ఘటన వెలుగు చూసింది. మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే అపార్ట్‌మెంట్‌వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని ప్రమాదం నుంచి కాపాడారు. ప్రాథమిక చికిత్స అందించడం కోసం బాలుడ్ని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సహకారంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
108 ఈఎంటి తజుద్దీన్, పైలెట్ సురేశ్ కలిసి బాలుడిని లిఫ్టులో నుంచి తీసుకుని సిపిఆర్ చేస్తూ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు మెరుగైన వైద్యం అందించి బాలుడి ప్రాణాలను కాపాడారు. 108 సిబ్బందిని, డాక్టర్లను ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అభినందించారు. గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్ మధ్య బాలుడు ఇరుక్కుపోయినట్లు తెలిపారు. దీంతో పొట్ట, వెన్నులో తీవ్రంగా గాయాలయ్యాయన్నారు. లిఫ్ట్, గోడకు మధ్యన బాలుడు చిక్కుకోవడంతో అతడిపై తీవ్ర ఒత్తిడి పడినట్లు వైద్యులు పేర్కొన్నారు.