టైటానిక్ బాటలోనే టైటాన్ జలసమాధి

శకలాలు కనిపించకపోయినా టైటాన్ లోని ఆక్సిజన్ ఇప్పటికే అయిపోయి ఉంటుంది. అంటే టైటాన్ పేలిపోయినా లేక ఎక్కడైనా చిక్కుకుపోయినా అందులోని మనుషులు బతికే అవకాశాలు లేవు. అందుకే వారు మరణించినట్టు ఆ సంస్థ ప్రకటించింది.

Advertisement
Update:2023-06-23 07:51 IST

టైటానిక్ శిథిలాల దగ్గరకు వెళ్లడానికి మినీ జలాంతర్గామిలో బయలుదేరిన సాహసికులు దానికి టైటాన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ.. ఇప్పుడు ఆ సెంటిమెంట్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. టైటాన్ కూడా టైటానిక్ లాగే జలసమాధి అయింది. టైటాన్ జలాంతర్గామితో ఈ సాహసయాత్ర ప్లాన్ చేసిన ఓషన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. టైటాన్ లో ప్రయాణం చేసిన తమ సంస్థ సీఈఓ స్టాక్టన్‌ రష్‌, ఆయనతో పాటు వెళ్లిన షెహ్జాదా దావూద్‌, సులేమాన్‌ దావూద్‌, హమీష్‌ హర్డింగ్‌, పాల్‌ హెన్రీ నార్గెలెట్‌ ప్రాణాలతో లేరని అర్థరాత్రి ప్రకటన విడుదల చేసింది.


అట్లాంటిక్‌ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ నౌక శిథిలాలను చూసివచ్చేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ జలాంతర్గామికోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ఫలించలేదు. 4రోజుల గాలింపు చర్యల అనంతరం ఆ జలాంతర్గామిలోనివారంతా జలసమాధి అయ్యారని తేల్చేశారు. అయితే వారి మృతదేహాలు కానీ టైటాన్ జలాంతర్గామి శిథిలాల గురించి సమాచారం బయటకు రాలేదు. వారంతా చనిపోయారని ఓషన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ సంస్థ ఎలా ప్రకటించిందనే దానికి ఆధారాలు లేవు. కానీ సాహస యాత్రను మొదలు పెట్టిన సంస్థే అధికారికంగా ధృవీకరించింది కాబట్టి ప్రస్తుతానికి టైటాన్ కథ కంచికి చేరుకున్నట్టే చెప్పాలి.

టైటానిక్ సమీపంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన అమెరికా కోస్ట్ గార్డ్ కొన్ని శకలాల ఫొటోలు విడుదల చేసింది. అయితే అవి పాత ఫొటోలని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. పోలార్ ప్రిన్స్ అనే నౌకకు అనుసంధానంగా టైటాన్ ని సముద్ర జలాల్లోకి పంపించారు. నిత్యం ఆ నౌకతో టైటాన్ కి కమ్యూనికేషన్ ఉండేది. ఆ కమ్యూనికేషన్ తెగిపోగానే ప్రమాదం జరిగినట్టు నిర్థారించారు. 4రోజులపాటు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రోబోల సాయంతో సముద్రం అడుగున వెదికారు. శకలాలు కనిపించకపోయినా టైటాన్ లోని ఆక్సిజన్ ఇప్పటికే అయిపోయి ఉంటుంది. అంటే టైటాన్ పేలిపోయినా లేక ఎక్కడైనా చిక్కుకుపోయినా అందులోని మనుషులు బతికే అవకాశాలు లేవు. అందుకే వారు మరణించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. 

Tags:    
Advertisement

Similar News