థాయ్‌లాండ్ డే-కేర్ సెంటర్ లో కాల్పులు.. 22మంది చిన్నారులతో సహా 34 మంది మృతి!
థాయ్‌లాండ్ లో జరిగిన దారుణమైన ఘటనలో 34 మంది మృతి చెందారు. ఓ డే కేర్ సెంటర్ లో మాజీ పోలీసు అధికారి జరిపిన విచ్చలవిడి కాల్పుల్లో 22 మంది పిల్లలతో సహా 34 మంది మరణించినట్టు అధికారులు ప్రకటించారు.
థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. ఇక్కడి పిల్లల డే-కేర్ సెంటర్‌లో గురువారం జరిగిన సామూహిక కాల్పుల్లో 34 మంది మరణించారు. ఒక మాజీ పోలీసు అధికారి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో 22 మంది చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఈ ప్రాంతంలోని కొన్ని ఇతర దేశాలతో పోలిస్తే తుపాకీ లైసెన్సుల ఉన్నవారి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ థాయిలాండ్‌లో సామూహిక కాల్పులు చాలా అరుదు. అయితే ఇక్కడ అక్రమ ఆయుధాలు, వ్యాపారం సర్వసాధారణం.
2020లో, ఆస్తి వ్యవహారంలో తలెత్తిన వివాదంలో కోపంతో ఒక సైనికుడు జరిపిన కాల్పుల్లో 29 మంది మరణించగా, 57 మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఇంత దారుణం జరగడం ఇదే. తాజా సంఘటనలో ఆ వ్యక్తి ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు తదితర వివరాలు తెలియాల్సి ఉంది.