అసద్‌ను రష్యా అందుకే పట్టించుకోలేదు
సిరియాలో ప్రభుత్వ పతనంపై సోషల్ మీడియా ట్రూత్‌లో స్పందించిన డొనాల్డ్ ట్రంప్
పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను రష్యా, ఇరాన్ కాపాడలేదని అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆయన తాజాగా సిరియాలో ప్రభుత్వ పతనంపై సోషల్ మీడియా ట్రూత్‌లో స్పందించారు.
అసద్ వెళ్లిపోయారు. ఆయన దేశం నుంచి పారిపోయారు. ఇన్నాళ్లు రక్షించిన పుతిన్ నేతృత్వంలోని రష్యా కూడా ఆయనపై ఏ మాత్రం ఆసక్తి చూపెట్టలేదు. సిరియా యుద్ధానికి ప్రాధాన్యం ఇవ్వడానికి మాస్కోకు ఎలాంటి కారణం కనిపించలేదు. ఉక్రెయిన్‌తో యుద్ధం అసలు జరగాల్సింది కాదు.. ఇప్పుడు ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి.. దీనితో సుమారు 6,00,000 మంది సైనికులు గాయపడటమో.. మరణించడమో జరగడమే అసద్‌ను పట్టించుకోకపోవడానికి కారణం. రష్యా, ఇరాన్ బలహీనంగా ఉన్నాయి. యుద్ధం, చెత్త ఆర్థిక స్థితి, ఇజ్రాయెల్ వరుస విజయాలు దీనికి కారణం.
మరోవైపు జెలెన్‌స్కీ కూడా ఈ పిచ్చి పని ఆపడానికి వెంటనే ఓ ఒప్పందం చేసుకోవాలి. ఇప్పటికే 4,00,00 మంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులు మరణించారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి.. చర్చలు మొదలుపెట్టాలి. చాలామంది జీవితాలు వృథా అయ్యాయి. చాలా కుటుంబాలు నాశనమయ్యాయి. ఇదే కొనసాగితే... పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. నాకు పుతిన్ సంగతి బాగా తెలుసు. తగిన చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. చైనా సాయం చేయవచ్చు. ప్రపంచం ఎదురు చూస్తున్నదని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.