ఆకాశంలో రాత్రి మెరుస్తూ కదులుతున్న వస్తువుల కలకలం
అవి యూఎఫ్‌వో తరహా డ్రోన్లుగా వ్యక్తమౌతున్నఅనుమానాలు
అగ్రరాజ్యం అమెరికాలోని ఆకాశంలో మెరుస్తూ కదులుతున్న వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూజెర్సీలోని పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలో అకాశంలో అనుమానాస్పదంగా ఈ వస్తువులు కనిపించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అవి యూఎఫ్‌వో తరహా డ్రోన్లుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.
ఇటీవల న్యూజెర్సీలో మెరుస్తున్న డ్రోన్లు ఎగిరాయి. తమ భవనాల మీదుగా ఇవి ఎగరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అవి హెలికాప్టర్లు అని కొందరు చెబుతుండగా.. యూఎఫ్‌వో తరహా డ్రోన్లుగా మరికొంతమంది అనుమానిస్తున్నారు. అయితే.. గత నెలలో న్యూజెర్సీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.
సుమారు పది ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరడాన్ని స్థానికులు గుర్తించారు. అంతేగాకుండా అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన భవనాల సమీపంలోనూ ఇలాంటి డ్రోన్లు కనిపించడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. ఈ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాలపై నిషేధం విధించింది. న్యూజెర్సీలో తాజాగా ఘటనపై స్పందించిన గవర్నర్ ఫిల్ మర్ఫీ.. దీనిపై అధికారులు విచారణ చేపడుతున్నారని, ప్రజలకు ఎలాంటి ముప్పులు లేదని పేర్కొన్నారు.