నదిలో పడిన రెండు బస్సులు.. 65 మందికి పైగా గల్లంతు
ప్రయాణికులు సహా నదిలో పడిపోయిన బస్సులు గణపతి డీలక్స్, ఏంజెల్‌గా అధికారులు గుర్తించారు. వీటిలో గణపతి డీలక్స్ కు చెందినదిగా భావిస్తున్న బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు తప్పించుకున్నారు.
ప్రయాణికులతో వెళుతున్న 2 బస్సులపై కొండచరియలు విరిగిపడటంతో.. ఆ బస్సులు రెండూ పక్కనే ఉన్న నదిలో పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదం నేపాల్‌లోని నారాయణ ఘాట్–ముగ్లింగ్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సుల్లో ప్రయాణిస్తున్న 65 మందికి పైగా ప్రయాణికులు నదిలో పడి గల్లంతయ్యారు. వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఒక బస్సు 24 మంది ప్రయాణికులతో ఖాట్మండూ వెళుతుండగా, అదే మార్గంలో 41 మంది ప్రయాణికులతో మరో బస్సు కూడా వెళుతోంది. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తోంది. కొండచరియలు విరిగి∙బస్సులపై పడ్డాయి. దీంతో బస్సులు పక్కనే ఉన్న త్రిశూన్ నదిలో పడిపోయాయి. మరో బస్సు పైనా కొండచరియలు విరిగి పడటంతో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ బస్సు బుట్వాల్ నుంచి ఖాట్మండూకు వెళుతోంది. మృతుడిని మేఘనాథ్‌గా గుర్తించారు.
ప్రయాణికులు సహా నదిలో పడిపోయిన బస్సులు గణపతి డీలక్స్, ఏంజెల్‌గా అధికారులు గుర్తించారు. వీటిలో గణపతి డీలక్స్ కు చెందినదిగా భావిస్తున్న బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు తప్పించుకున్నారు. బస్సు ప్రమాదానికి గురికాగానే వారు దానిలోనుంచి బయటకు దూకేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు అక్కడ బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో పడినవారి కోసం గాలింపు చేపట్టారు.