చైనాలో వ్యాపిస్తున్నవి 4 వేరియంట్లు..! - కేంద్ర కోవిడ్ ప్యానల్ చీఫ్ వీకే అరోడా వెల్లడి
బీఎన్, బీక్యూ, ఎస్‌వీవీ వేరియంట్లు అక్కడ వ్యాపిస్తున్నాయని చెప్పారు. బీఎన్, బీక్యూ వేరియంట్ల రూపంలో వ్యాప్తి చెందిన కేసులు అక్కడ 50 శాతం ఉన్నాయని ఆయన తెలిపారు.
చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్.. ఒక వేరియంట్ రూపంలో లేదని.. అక్కడ నాలుగు వేరియంట్లు వ్యాపిస్తున్నాయని కేంద్ర కోవిడ్ ప్యానల్ చీఫ్ వీకే అరోడా వెల్లడించారు. ఓ ఇంగ్లిష్ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. చైనాలో బీఎఫ్-7 వేరియంట్ వ్యాపిస్తోందని ఇప్పటి వరకు ప్రపంచమంతా భావిస్తోంది. అయితే ఈ వేరియంట్ ప్రభావంతో నమోదైన కేసులు అక్కడ 15 శాతం మాత్రమేనని అరోడా వెల్లడించారు.
ఈ వేరియంట్ కాకుండా మరో మూడు వేరియంట్లు అక్కడ వ్యాప్తి చెందుతున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వాటిలో బీఎన్, బీక్యూ, ఎస్‌వీవీ వేరియంట్లు అక్కడ వ్యాపిస్తున్నాయని చెప్పారు. బీఎన్, బీక్యూ వేరియంట్ల రూపంలో వ్యాప్తి చెందిన కేసులు అక్కడ 50 శాతం ఉన్నాయని ఆయన తెలిపారు. ఎస్‌వీవీ వేరియంట్ నుంచి మరో 15 శాతం కేసులు నమోదవుతున్నాయని అరోడా చెప్పారు. అందువల్లే అక్కడి రోగుల్లో భిన్న లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు.
భారత ప్రజలకు ఆందోళన అవసరం లేదు..
చైనాలో పరిస్థితిని చూసి భారత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అరోడా చెప్పారు. భారత ప్రజల్లో హైబ్రీడ్ ఇమ్యూనిటీ ఉండటమే దీనికి కారణమని ఆయన తెలిపారు. ఈ ఇమ్యూనిటీ వ్యాక్సిన్ల ద్వారా, ఇన్ఫెక్షన్ల ద్వారా, కోవిడ్ తొలి, రెండవ, మూడవ వేరియంట్ల ద్వారా లభించిందని ఆయన వివరించారు.
చైనాలో వారు తీసుకున్న వ్యాక్సిన్లు తక్కువ ప్రభావవంతమైనవి అయ్యుంటాయని, అందుకే కోవిడ్ అక్కడ విస్తృతంగా వ్యాపిస్తోందని, మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తెలిపారు. వారు మూడు, నాలుగు డోసుల టీకాలు తీసుకున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని చెప్పారు. చైనాతో పోలిస్తే భారత్‌లో 97 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నారని అరోడా తెలిపారు. అందుకే మనం సురక్షితంగా ఉన్నట్టు భావించవచ్చని ఆయన చెప్పారు.