తిరుగుబాటుదారుల చేతుల్లోకి సిరియా

దేశ రాజధానిని అక్రమించుకున్న రెబల్స్‌.. దేశాన్ని విడిచి వెళ్లిన దేశాధ్యక్షుడు

Advertisement
Update:2024-12-08 10:05 IST

సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్నది. తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్ని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. తాజాగా దేశ రాజధాని డమాస్కస్‌ను కూడా ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ రాజధాని విడిచి వెళ్లినట్లు ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. తిరుగుబాటు దళాలు దేశ రాజధాని డమాస్కస్‌లోకి ప్రవేశించడంతో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భద్రతా దళాలు పారిపోయినట్లు సమాచారం. ఈ పరిణామాల వేళ అధ్యక్షుడు విమానంలో వెళ్లిపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడికి వెళ్లారన్నదానిపై స్పష్టత లేదు. ప్రజలు దేన్ని ఎంచుకుటే దానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సిరియా ప్రధాని మహమ్మద్‌ అల్‌ జలాలీ తెలిపారు. 'సిరియా ఓ సాధారణ దేశం. అది ప్రపంచదేశాలతో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నది. ప్రజలు ఎన్నుకునే నాయకత్వంపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారు ఎంచుకునేదానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని' జలాలీ పేర్కొన్నారు.

సుమారు దశాబ్దం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లి.. గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. బషర్‌ అల్‌-అసద్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని దళాల్ని వెనక్కి నెడుతూ.. ఇప్పటికే పలు కీలక నగరాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే దేశ రాజధానిని కూడా ఆధీనంలోకి తీసుకోవడంతో సిరియా పూర్తిగా రెబల్స్‌ చేతుల్లోకి వెళ్లిపోయినట్లయింది.

Tags:    
Advertisement

Similar News