అంతర్జాతీయ వేదికపై ‘హాయ్ నాన్న’కు అవార్డుల పంట.. - ఏకంగా 11 అవార్డులకు ఎంపిక
ఇక ఉత్తమ నటిగా పురస్కారం పొందిన మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఒనిరోస్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకోవడం చాలా థ్రిల్‌గా ఉందని చెప్పారు.
తండ్రి, కూతురు సెంటిమెంటుతో రూపొందించిన ‘హాయ్ నాన్న’ చిత్రం అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ’ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్’లో ఉత్తమ చిత్రం సహా 11 అవార్డులు సొంతం చేసుకుంది. నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం సాధించిన అవార్డుల వివరాలిలా ఉన్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్ ట్రాక్, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డు లభించాయి. ’హాయ్ డాడీ’ పేరుతో ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా విడుదల చేయడంతో అక్కడ కూడా ఈ చిత్రం సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక దర్శకుడు శౌర్యవ్ దీనిపై స్పందిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ చిత్రానికి ఇంత ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ‘హాయ్ నాన్న’ చిత్రం కోసం తామంతా పడిన కష్టానికి ఫలితమిదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. నటీనటులు, సిబ్బంది సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన చెప్పారు.
ఇక ఉత్తమ నటిగా పురస్కారం పొందిన మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఒనిరోస్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకోవడం చాలా థ్రిల్‌గా ఉందని చెప్పారు. తన కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. కథ బాగుంటే సినిమాకు ఎక్కడైనా ఆదరణ లభిస్తుందని ఈ చిత్రం ద్వారా రుజువైందన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన యష్న పాత్ర తనకు జీవితమంతా గుర్తుంటుందని తెలిపారు. ఈ చిత్ర బృందంతో పని చేయడం తనకు గొప్ప అనుభూతినిచ్చిందన్నారు.