ఆ వృత్తుల్లో ఉన్న మహిళలకు అండాశయ క్యాన్సర్ వస్తుందా..?
కెనడాకు చెందిన 491మంది అండాశయ క్యాన్సర్ ఉన్న మహిళలను, 897మంది క్యాన్సర్ లేని మహిళలను అధ్యయనంలో పోల్చిచూశారు. వారు తమ వృత్తుల్లో భాగంగా ఎలాంటి రసాయనాలకు సన్నిహితంగా ఉన్నారనేది గుర్తించారు.
హెయిర్ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లు, అకౌటెంట్లు.. ఈ మూడు ఉద్యోగాల్లో ఉన్న స్త్రీలకు ఒవేరియన్ క్యాన్సర్.. అంటే అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం హెచ్చుగా ఉంటుందని ఓ నూతన అధ్యయనంలో తేలింది. అలాగే అమ్మకాలు, చిల్లర వర్తకం, నిర్మాణ రంగాల్లో ఉన్న స్త్రీలకు సైతం ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్ మెంటల్ మెడిసిన్ అనే జర్నల్ లో ఈ అధ్యయన వివరాలను ప్రచురించారు. అయితే అండాశయ క్యాన్సర్ కి, మహిళలు నిర్వహించే భిన్న వృత్తులకు మధ్య ఉన్న సంబంధంపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని అధ్యయన నిర్వాహకులు తెలిపారు.
కెనడాకు చెందిన 491మంది అండాశయ క్యాన్సర్ ఉన్న మహిళలను, 897మంది క్యాన్సర్ లేని మహిళలను అధ్యయనంలో పోల్చిచూశారు. వారు తమ వృత్తుల్లో భాగంగా ఎలాంటి రసాయనాలకు సన్నిహితంగా ఉన్నారనేది గుర్తించారు. అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం హెచ్చుగా ఉన్నవారు అమ్మోనియా, హైడ్రోజన్ పెరాక్పైడ్, జుట్టుకి సంబంధించిన దుమ్ము, సింథటిక్ పాలియస్టర్ ధారాలు, మేకప్ లో వాడే పౌడర్లు, ఆర్గానిక్ రంగులు, బ్లీచ్ లు వంటి వాటికి దగ్గరగా ఉన్నారని పరిశోధకులు కనుగొన్నారు. హెయిర్ డ్రెస్సర్లు, బార్బర్లు, బ్యూటీషియన్లకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట.
పదేళ్లకు పైగా గణిత సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు వ్యాధి వచ్చే ప్రమాదం రెండింతలు, నిర్మాణ రంగంలో ఉన్న మహిళలకు మూడింతలు ఎక్కువగా ఉంటుందని కూడా అధ్యయనం చెబుతోంది. షాపుల్లో సహాయకులుగా పనిచేస్తున్నవారికి, అమ్మకాల రంగంలో ఉన్నవారికి 45శాతం అధికంగానూ, దుస్తుల తయారీ రంగంలో ఉన్నవారికి 85శాతం ఎక్కువగానూ ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది. మహిళలకు వారు చేస్తున్న వృత్తుల వలన వచ్చే అనారోగ్యాలపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని అధ్యయన నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.