విమర్శల ఎఫెక్ట్ : నెట్‌ఫ్లిక్స్ నుంచి రానానాయుడు తెలుగు వెర్షన్ తొలగింపు
ఇన్నేళ్ల కెరీర్ లో వెంకటేష్ కు ఈ వెబ్ సిరీస్ మాయని మచ్చని తెచ్చి పెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఈ వెబ్ సిరీస్ ను తొలగించాలని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ స్పందించింది. వివాదం మరింత ముదరకుండా కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు అగ్రహీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఈనెల 10వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలు కాగా, దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సిరీస్ నిండా సెక్స్ సీన్స్, బూతు డైలాగులు నింపడంపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇందులో పది ఎపిసోడ్‌లు ఉండగా.. ప్రతి ఎపిసోడ్ లో అడల్ట్ కంటెంట్ కనిపించింది.
ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న వెంకటేష్ ఇటువంటి వెబ్ సిరీస్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఈ వెబ్ సిరీస్ చూసిన పలువురు సినీ ప్రముఖులు దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది వెబ్ సిరీస్ కాదని.. బూతు ఫిల్మ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్ సిరీస్ లను కూడా సెన్సార్ చేసిన తర్వాతే విడుదల చేయాలని సూచనలు చేశారు.
వెంకటేష్ ఉన్నాడు కదా.. అని కుటుంబ సమేతంగా ఈ సిరీస్ ని చూడటం మొదలుపెట్టి ఇందులోని బూతు సీన్లను చూడలేక వెంటనే టీవీ ని కట్టేసినట్లు పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇన్నేళ్ల కెరీర్ లో వెంకటేష్ కు ఈ వెబ్ సిరీస్ మాయని మచ్చని తెచ్చి పెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఈ వెబ్ సిరీస్ ను తొలగించాలని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ స్పందించింది. వివాదం మరింత ముదరకుండా కీలక నిర్ణయం తీసుకుంది.
రానా నాయుడు వెబ్ సిరీస్ ని హిందీతోపాటు దేశంలోని పలు భాషల్లో విడుదల చేశారు. అయితే తెలుగు వెర్షన్ పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ రానా నాయుడు తెలుగు వెర్షన్ ను ఓటీటీ నుంచి తొలగించింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు మినహా ఇతర భాషల్లో రానా నాయుడు వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.