రికార్డుస్థాయిలో పసిడి ధర.. రూ. 90 వేల మార్క్‌కు చేరువలో
ఇలానే కొనసాగితే చరిత్రలో తొలిసారిగా బంగారం ధర త్వరలోనే రూ. లక్ష మార్క్‌ను తాకే అవకాశం ఉందన్న మార్కెట్ విశ్లేషకులు;
బంగారం ధరకు మళ్లీ రెక్కలు వచ్చాయి. రికార్డుస్థాయిలో పసిడి ధర రూ. 90 వేల మార్క్‌కు చేరువలో ఉన్నది.నేడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 88,619 గా ఉన్నది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే చరిత్రలో తొలిసారిగా బంగారం ధర త్వరలోనే రూ. లక్ష మార్క్‌ను తాకే అవకాశం కనిపిస్తున్నది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 2,987 డాలర్లకు చేరింది.
మరోవైపు వెండి ధర ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. కిలో వెండి రేటు రూ. 1,03,000 రూపాయలకు చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ దెబ్బతో అటు స్టాక్‌మార్కెట్లు సైతం కుదేలవుతున్నాయి. మరోవైపు డాలర్ మరింత బలం పెంచుకున్నది. అలాగే ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, ముడి ఖనిజాలపైన టారిఫ్‌లు విధిస్తుండటంతో చైనా, భారత్ లాంటి దేశాలకు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. దీంతో ఆసియా మార్కెట్లలోనూ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. దీనికితోడు వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపడంతో అక్కడ టెక్నాలజీ కంపెనీలు తమ లాభాలను కోల్పోతున్నాయి. ఇటు విదేశీ ఇన్వె స్టర్లు ఇండియాలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం వల్లనే గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే మునుముందు 10 గ్రాముల బంగారం ధర రూ. లక్ష రూపాయలు టచ్ అవడానికి ఎంతోటైం పట్టకపోవచ్చు అంటున్నారు. పెండ్లిళ్ల సమయంలో బంగారం రేట్లు విపరీతంగా పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి జనం బంగారం కొనడానికి నానా తిప్పలు పడుతున్నారు.