భారత్.. వినడానికి బాగుంది - సునీల్ గవాస్కర్ వెల్లడి
దీనిపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీసీఐ స్థాయిలో మన జట్టును ‘భారత్ క్రికెట్ టీమ్’ అని పిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం `ఇండియా` పేరును `భారత్`గా మార్చబోతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశంపైనే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ త్వరలో భారత్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో మన ఆటగాళ్లు టీమ్ ఇండియాకు బదులు `టీమ్ భారత్` జెర్సీలతో బరిలోకి దిగాలని తన అభిప్రాయం వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజాగా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా `భారత్` అంశంపై స్పందించారు. మన దేశం అసలు పేరు భారత్ అని, ఇది వినడానికి కూడా బాగుందని వ్యాఖ్యానించారు. దీనిపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీసీఐ స్థాయిలో మన జట్టును ‘భారత్ క్రికెట్ టీమ్’ అని పిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది వరకు కూడా దేశాల పేర్లలో మార్పులు జరిగాయని, బర్మాను ఇప్పుడు మయన్మార్ అని పిలుస్తున్నారని ఆయన తెలిపారు. మన దేశం కూడా అసలు పేరుకు మారొచ్చని, దీని వల్ల పెద్దగా ఇబ్బంది ఉన్నట్టు కనిపించడం లేదని పేర్కొన్నారు. కానీ, ఇది అన్నిస్థాయిల్లో మారాల్సి ఉంటుందని గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.