చలికాలం చుండ్రు సమస్య ఇలా దూరం!
చలికాలం శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల చాలామందికి చుండ్రు సమస్య మొదలవుతుంది. జుట్టు నిర్జీవంగా మారిపోయి, ఎక్కువగా రాలిపోతుంటుంది.
చలికాలం శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల చాలామందికి చుండ్రు సమస్య మొదలవుతుంది. జుట్టు నిర్జీవంగా మారిపోయి, ఎక్కువగా రాలిపోతుంటుంది. మరి ఈ సమస్యకు చెక్ పెట్టేదెలా?
చలికాలంలో నీళ్లు తక్కువగా తాగడం, కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల తలలో చర్మం పొడిబారి చుండ్రు మొదలవుతుంది. దీనికితోడు చలికి తలస్నానం చేయకపోవడం, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి అలవాట్ల ద్వారా సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే.
చుండ్రు సమస్యను వేధిస్తున్నవాళ్లు నీళ్లు ఎక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజుకి నాలుగైదు లీటర్లు నీళ్లు తాగేలా చూసుకోవాలి. శరీరంలో నీటిశాతం పెరగడం ద్వారా మాడుపై చర్మం పొడిబారకుండా ఉంటుంది.
చలికాలం బద్ధకించకుండా వారానికి రెండు మూడు సార్లయినా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. అలాగే జుట్టు పూర్తిగా ఆరబెట్టుకోవాలి. బయటకు వెళ్లివచ్చినప్పుడల్లా జుట్టుని శుభ్రం చేసుకోవాలి.
చుండ్రు సమస్య తగ్గించేందుకు హెయిర్ ప్యాక్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. నాలుగు టేబుల్‌స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి జుట్టుకి ప్యాక్‌లా వేసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల దగ్గర బాగా అప్లై చేయాలి. తద్వారా మాడుపై చర్మం హైడ్రేట్ అవుతుంది. అరగంట తర్వాత చన్నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది.
జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్లు మందార ఆకులతో హెయిర్ ప్యా్క్ వేసుకోవచ్చు. కొన్ని మందార ఆకుల్ని తీసుకుని మెత్తగా మిక్సీ పట్టి అందులో హెన్నా పౌడర్ లేదా మెంతుల పొడి కలిపి జుట్టుకి పట్టించాలి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరిన తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
ఇకపోతే చుండ్రు సమస్య తగ్గేందుకు జింక్, బయోటిన్ ఎక్కువగా ఉండే నట్స్, గుడ్ల వంటి ఆహారాలు తీసుకోవాలి. ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలు కూడా తినాలి. అలాగే పెరుగు, వాల్నట్స్, ఆవకాడో, అరటిపండ్లు వంటివి తీసుకోవాలి.