మెదడు రక్తాన్ని చేయి దొంగిలిస్తే... సబ్ క్లేవియన్ స్టీల్ సిండ్రోమ్
సాధారణంగా మనం చేతులతో పనులు చేస్తూనే నోటితో మాట్లాడుతుంటాం కదా. చేతులతో చేసే పనులు మాటలకు ఆటంకం కావు. అయితే సబ్ క్లేవియన్ స్టీల్ సిండ్రోమ్ అనే సమస్య ఉన్నవారు తమ చేత్తో పనిచేస్తున్నంత సేపు మాట్లాడలేరు.
సాధారణంగా మనం చేతులతో పనులు చేస్తూనే నోటితో మాట్లాడుతుంటాం కదా. చేతులతో చేసే పనులు మాటలకు ఆటంకం కావు. అయితే సబ్ క్లేవియన్ స్టీల్ సిండ్రోమ్ అనే సమస్య ఉన్నవారు తమ చేత్తో పనిచేస్తున్నంత సేపు మాట్లాడలేరు. గత రెండు నెలలుగా ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ఓ పేషంటుకి బెంగళూరు వైద్యులు చికిత్స చేశారు. అనంతపురం కి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు ఈ సమస్యతో బాధపడుతుండగా బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరిగింది. మెదడునుండి రక్తాన్ని చేయి దొంగిలించడంగా వైద్యశాస్త్రం దీనిని అభివర్ణించింది.
గత రెండునెలల కాలంగా ఆ వ్యక్తి తన ఎడమచేత్తో పనిచేస్తున్నపుడు మాట్లాడలేకపోతున్నాడు. అతనికి అప్పటికే రెండుసార్లు స్ట్రోక్ వచ్చింది. తరువాత అతను ఈ సమస్యకు గురయ్యాడు. మన శరీరంలో మెడకింద కాలర్ బోన్ దిగువభాగంలో రెండు వైపులా సబ్ క్లేవియన్ అనే ధమనులు ఉంటాయి. ఇవి ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని గుండెనుండి శరీరంలోని పైభాగాలకు అంటే తల, మెడ, చేతులకు తీసుకువెళుతుంటాయి. ఈ ధమనుల్లో లోపం వల్లనే సబ్ క్లేవియన్ స్టీల్ సిండ్రోమ్ ఏర్పడుతుంది.
సబ్ క్లేవియన్ ధమనులనుండి తల, చేతులు మెడల్లో ఉండే రక్తనాళాలకు రక్తం చేరుతుంటుంది. అయితే ఎడమచేతికి రక్తాన్ని తీసుకునివెళ్లే సబ్ క్లేవియన్ ధమనులు కొలెస్ట్రాల్ కారణంగా మూసుకుపోవటం వలన ఆ పేషంటుకి ఎడమచేయి లోపల రక్త ప్రసరణ తగ్గిపోయింది. ఎడమచేతి వైపున్న రక్త నాళాలు మెదడుకి వెళ్లాల్సిన రక్తాన్నిఆటంకపరచి తాము తీసుకోవటంతో మెదడుకి రక్తసరఫరా లోపించి మాట్లాడలేని అశక్తత ఏర్పడింది.
అందుకే ఆ పేషంటుకి ఎడమచేయి పనిచేస్తున్నపుడు మాట్లాడలేకపోవటం అనే సమస్య ఏర్పడింది. ఈ సమస్య తీరాలంటే రక్తసరఫరా ఆగిపోయిన చేతికి తిరిగి రక్తం అందాల్సి ఉంటుంది. వైద్యులు చేతికి రక్తాన్ని తీసుకుని వెళ్లే రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ ని తొలగించడంతో వెంటనే స్ట్రోక్ లక్షణాలు తగ్గిపోయి సమస్య పరిష్కారమైంది. చికిత్స చేసిన వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు. సబ్ క్లేవియన్ స్టీల్ సిండ్రోమ్ చాలా అరుదుగా ఏర్పడుతుంటుంది. ఎడమచేత్తో పనిచేస్తున్నపుడు మాట్లాడలేకపోవటంతో ఆ పేషంట్ తనకు మరోసారి ప్ట్రోక్ వచ్చిందనే అనుకున్నాడు. అయితే ఎడమచేయిని విశ్రాంతిగా ఉంచినప్పుడు మాటలు యథాతథంగా వస్తుండటంతో వైద్యులు లోతుగా పరిశీలించి తగిన చికిత్సని అందించారు.