వ్యాయామం చేస్తుండగా గుండెపోటు.. అసలు కారణాలు ఏంటి?

గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడటాన్ని 'డిఫెక్షన్' అంటారు. రక్తనాళాల్లో చెప్పుకోదగిన బ్లాక్స్ లేకపోయినా, కొవ్వు కణాలతో కూడిన ప్లాక్స్‌పై పగుళ్లు ఏర్పడితే అకస్మాతుగా రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయి.

Advertisement
Update:2022-11-11 17:16 IST

బుల్లితెర నటుడు సిద్ధార్థ్ వీర్ సూర్యవంశీ శుక్రవారం గుండెపోటుతో మరణించారు. 46 ఏళ్ల సూర్యవంశీ.. కుసుమ్, వారిస్, సూర్యపుత్ర్ కర్ణ్ వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించారు. ఇవాళ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా సూర్యవంశీ గుండె పోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఒక్కసారిగా గుండెపోటు రావడం, కుప్పకూలడం, ప్రాణాలు వదిలేయడం నిమిషాల వ్యవధిలో జరిగిపోతోంది. ఎంతో ఆరోగ్యంగా ఉంటూ, మంచి ఆహార నియమాలను పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్న వారిలో కూడా హార్ట్ ఎటాక్ కామన్ అయిపోయింది.

ఇటీవల కాలంలో కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్, టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా, కమేడియన్ రాజు శ్రీవాస్తవ వ్యాయామం చేస్తున్న సమయంలోనే గుండె పోటు వచ్చి మరణించారు. జమ్ము కశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూ స్టేజ్‌పై గుండె పోటుతో కుప్పకూలి చనిపోయాడు. ముంబైలో ఒక జిమ్ ట్రైనర్ వ్యాయామం చేస్తూ.. మరో యువకుడు గర్భా ఆడుతూ మరణించారు. తాజాగా సూర్యవంశీ కూడా వ్యాయామం చేస్తూ చనిపోవడంతో చాలా మంది యువకుల్లో ఆందోళన నెలకొన్నది. దీనిపై వైద్యులు పలు కారణాలు వెల్లడిస్తున్నారు.

పునీత్ రాజ్‌కుమర్, సిద్ధార్థ్ శుక్లా వంటి ఫిట్‌నెస్ ఫ్రీక్స్ గతంలో పలు పరీక్షలు కూడా చేయించుకున్నారు. వారి రక్తనాళాల్లో ఎలాంటి క్లాట్స్, బ్లాక్స్ లేనట్లు గుర్తించారు. అయినా వారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఫిట్‌నెస్, ఆరోగ్యం కోసం కఠినమైన వ్యాయామం చేసే వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాయామం ఎక్కువగా చేసే వారి గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడే అవకాశాలు ఉంటాయని, అది గుండె పోటుకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడటాన్ని డిఫెక్షన్ అంటారు. రక్తనాళాల్లో చెప్పుకోదగిన బ్లాక్స్ లేకపోయినా, కొవ్వు కణాలతో కూడిన ప్లాక్స్‌పై పగుళ్లు ఏర్పడితే అకస్మాతుగా రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయి. వ్యాయామం చేసే సమయంలో రక్త ప్రసరణ వేగవంతం అయ్యి.. ఆ పగుళ్ల వద్ద రక్తం గడ్డ కడుతుంది. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది. కొంత మందిలో రక్తం ఎక్కువగా గడ్డ కడుతుంది. అలాంటి వారికి కఠిన వ్యాయామం ప్రమాదకరంగా మారవచ్చు.

ప్రోటీన్-సి, ప్రోటీన్-ఎస్, యాంటీ థ్రాంబిన్ 3 లోపం ఉన్న వారిలో ఇలా రక్తం గడ్డకట్టే గుణం ఉంటుంది. హోమోసిస్టిన్ అనే జీవ రసాయనం రక్తంలో ఎక్కువగా ఉంటే కూడా క్లాట్స్ ఏర్పడుతుంటాయి. ఇలా రక్తం త్వరగా గడ్డకట్టే ధోరణిని 'బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ'అని పిలుస్తుంటారు. ఇలాంటి వారిలో చిన్న పగుళ్లు ఏర్పడినా అక్కడ రక్తం త్వరగా గడ్డ కడుతుంటుంది. ఇక జన్యు పరమైన కారణాల వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన దాఖలాలు ఉంటే.. ఆ వ్యక్తి వ్యాయామం చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి.. గుండె ఎంత భద్రంగా ఉందో చెక్ చేయించుకుంటుండాలి. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. వ్యాయామం చేసే వాళ్లు కచ్చితంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. జిమ్ చేస్తూ సరైన ఆహారం తీసుకోకపోతే అది గుండె, రక్తనాళాలపై ప్రభావం చూపిస్తుంది.

ఇక స్మోకింగ్, డ్రింకింగ్ కూడా గుండెపోటుకు కారణాలు కావొచ్చు. జంక్ ఫుడ్ తీసుకోవడం, చెడు కొవ్వులైన ట్రైగ్లిసరైడ్స్ పెరగడం కూడా యువతలో గుండె పోటుకు అధిక కారణాలు. ఒబెసిటీ, మానసిక ఒత్తిడి కూడా హఠాత్తు మరణాలకు కారణాలు అవుతున్నాయి. బ్రుగాడా సిండ్రోమ్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి వంటి కారణాలు అకస్మాతుగా 'కార్డియాక్ అరెస్ట్' అయ్యే పరిస్థితులను సృష్టిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు.

అందుకే ఏ వ్యాయామమైనా అధిక శ్రమ కలిగించకుండా ఉండేదిగా చూసుకోవాలి. తీవ్రమైన ఆయాసం అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి. అధికంగా జిమ్ చేయడం కంటే రన్నింగ్, జాగింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. 40 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించాలి.

Tags:    
Advertisement

Similar News