డిప్రెషన్ కి ఆపరేషన్.... అవును అది సైకో సర్జరీ
మానసిక సమస్యలకు వైద్యులు థెరపీలు, మందులు ఇవ్వటం మనకు తెలుసు. కానీ మానసిక సమస్యలకు ఆపరేషన్లు కూడా చేస్తున్నారిప్పుడు. దీనిని సైకో సర్జరీ అంటారు.
మానసిక సమస్యలకు వైద్యులు థెరపీలు, మందులు ఇవ్వటం మనకు తెలుసు. కానీ మానసిక సమస్యలకు ఆపరేషన్లు కూడా చేస్తున్నారిప్పుడు. దీనిని సైకో సర్జరీ అంటారు. ఈ అరుదైన ఆపరేషన్ లను మనదేశంలో ఇటీవలే చేయటం మొదలుపెట్టారు. ఆఫ్రికాకు చెందిన 28ఏళ్ల వ్యక్తి తన 15వ ఏటనుండి స్కిజోఫ్రెనియాతో బాధపడుతుండగా అతనికి జూన్ పద్నాలుగున గురుగ్రామ్ లోని మరెంగో ఆసియా హాస్పటల్ లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సైకో సర్జరీ చేశారు. దీనిద్వారా మెదడుకి లోతుగా ఉద్దీపన (స్టిమ్యులేషన్) కలిగించారు. స్కిజోఫ్రెనియా వంటి అత్యంత క్లిష్టమైన మానసిక సమస్యకు సైకో సర్జరీ చేయటం భారతదేశంలో ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ విషయంలో ఈ కేసు పద్నాలుగవది. అలాగే 26ఏళ్లుగా డిప్రెషన్ తో పోరాడుతున్న 38ఏళ్ల ఆస్ట్రేలియా మహిళకు ముంబైలో మే 28న సైకియాట్రిక్ ఆపరేషన్ చేశారు. సైకియాట్రిక్ డిజార్డర్లకు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చాలాబాగా పనిచేస్తుందని తెలుస్తోంది.
న్యూరో టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఓసీడి, డిప్రెషన్, యాంగ్జయిటీ, మేనియా, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలకు బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీలు బాగా ఉపయోగకరంగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. మానసిక సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతూ మందులు, థెరపీలు పనిచేయక నిరాశపడుతున్నవారికి సైకో సర్జరీ మంచి పరిష్కారంగా వారు సూచిస్తున్నారు.
డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్... సైకో సర్జరీ ఎలా చేస్తారంటే...
మన మెదడు కణాలు వేగవంతమైన విద్యుత్ ప్రేరణల వలన పనిచేస్తుంటాయి. మన ఆలోచనలు, ప్రవర్తనలు వాటి కారణంగానే ఏర్పడుతుంటాయి. మెదడు పనితీరుకి విద్యుత్ ప్రేరణలే కారణమవుతున్నాయి కనుక మెదడు పనితీరుని మార్చేందుకు కూడా విద్యుత్ ప్రేరణలే ఉపయోగపడతాయి. ఈ విధానంలో భాగంగానే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సైకో సర్జరీ ద్వారా మెదడులోని కొన్ని నిర్దిష్టమైన భాగాల్లో ఎలక్ట్రోడ్ అనే పరికరాన్ని అమరుస్తారు. దానిద్వారా అవసరమైనంత మోతాదులో కరెంట్ ని పంపటం జరుగుతుంది. ఈ ఎలక్ట్రోడ్లు అతి సన్నగా నాలుగు నుండి ఐదు మిల్లీమిటర్ల వెడల్పులో ఉంటాయి. ఇవి ఛాతీలో అమర్చిన బ్యాటరీకి అనుసంధానం అయి ఉంటాయి. గుండెకు పేస్ మేకర్ లా ఈ విధానం పనిచేస్తుంది. గుండె లయని పేస్ మేకర్ సరిచేసినట్టుగా మెదడుని సైకోసర్జరీ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఇది మానసిక సమస్యల విషయంలో శాశ్వత థెరపీలా పనిచేస్తుంది.
పేషంటు స్పృహలోనే...
న్యూరో సర్జన్, న్యూరో అనెస్థటిస్ట్ ల అనుసంధానంతో ఈ ఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే శస్త్రచికిత్స సమయంలో పేషంటు స్పృహలోనే ఉంటాడు. ఆపరేషన్ సమయంలో అతని ప్రతిస్పందనని వైద్యులు గమనిస్తుంటారు. ఉదాహరణకు పార్కిన్సన్స్ వ్యాధికి సైకోసర్జరీ ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత కరెంటు ఇస్తే... పేషంటులో వారి ప్రమేయంలేకుండా జరిగే శరీర భాగాల కదలికలు వణుకు ఆగిపోతాయో వైద్యులు చూస్తుంటారు. సైకో సర్జరీకి నాలుగునుండి ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు రోజుల్లో పేషంటుని హాస్పటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. అయితే తరువాత ప్రతి మూడునెలలకు ఒకసారి పేషంటు వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. తొమ్మిది నుండి పన్నెండు నెలల తరువాత పేషంటు తీసుకునే మందులను సగం వరకు తగ్గిస్తారు.
ఇంతకుముందు ఈ ఆపరేషన్ లేదా?
గత దశాబ్దకాలంగా మనదేశంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ లను చేస్తున్నారు. అయితే పార్కిన్సన్స్ లాంటి నరాల సంబంధమైన అనారోగ్యాలకు మాత్రమే వీటిని చేస్తున్నారు. సైకియాట్రి సమస్యలకు గత కొంతకాలంగానే ఈ చికిత్సని అందిస్తున్నారు. మానసిక వ్యాధులకు కారణమవుతున్న మెదడు భాగం కచ్ఛితంగా తెలిసినప్పుడు మాత్రమే ఈ చికిత్సని ఆ వ్యాధులకు చేయగలుగుతారు. ఇంతకుముందు మానసిక సమస్యల విషయంలో అలా గుర్తించడం కష్టమవటం వల్లనే ఇప్పటివరకు ఈ చికిత్సని మానసిక సమస్యలకు చేయలేదని, గత కొన్నేళ్లలో ... ఈ విషయంలో ముందుడుగులు పడటం వల్లనే మానసిక వ్యాధులకు సైతం సైకో సర్జరీ చేసే అవకాశాలు పెరిగాయని వైద్యులు అంటున్నారు. ఈ రోజుల్లో మానసిక రుగ్మతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది మంచి పరిణామంగానే భావించాలి.