‘ఎవరూ లేకపోయినా... పక్కన ఎవరో ఉన్నట్టుంది’... అది పార్కిన్సన్స్

Parkinson Disease in Telugu | పార్కిన్సన్స్ అనేది మెదడుకి సంబంధించిన డిజార్డర్. మెదడులోని ఒక భాగంలోని నాడీ కణాలు క్షీణించడం వలన పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది.

Advertisement
Update:2023-07-06 00:44 IST

Parkinson Disease in Telugu | పార్కిన్సన్స్

పార్కిన్సన్స్ అనేది మెదడుకి సంబంధించిన డిజార్డర్. మెదడులోని ఒక భాగంలోని నాడీ కణాలు క్షీణించడం వలన పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి గురయినవారిలో తమ నియంత్రణ లేకుండా చేతులు వణకటం, శరీరంలో కండరాలు బిగుసుకుపోయినట్టుగా మారటం, శరీరం సమతుల్యతని కోల్పోవటం లాంటి లక్షణాలు కనబడతాయి. అయితే ఈ వ్యాధి ఉన్నవారిలో తాము ఒంటరిగా ఉన్నా పక్కన ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుందని, ఇతర లక్షణాలకంటే ముందే ఇలాంటి భ్రాంతులు ఉండే అవకాశం ఉందని... ఓ నూతన అధ్యయనంలో తేలింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పార్కిన్సన్స్ వ్యాధి మెదడుకి సంబంధించినది కనుక దీనికి గురయినవారిలో భ్రాంతులు ఉండే అవకాశం ఉంది. ఓ నూతన అధ్యయనంలో ఇదే అంశం తేలింది. వీరు ఒంటరిగా ఉన్నా ఎవరో తమ సమీపంలో ఉన్నారని, తమని చూస్తున్నారనే భ్రాంతికి గురయ్యే అవకాశం ఉందని, మెదడు పనితీరులో తేడా కారణంగా అలాంటి భ్రాంతులు కలుగుతాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. నేచర్ మెంటల్ హెల్త్ అనే పత్రికలో ఈ వివరాలను ప్రచురించారు. ప్రతి ఇద్దరు పార్కిన్సన్స్ వ్యాధి గ్రస్తుల్లో ఒకరిలో ఇలాంటి భ్రాంతులు ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు. పార్కిన్సన్స్ వ్యాధిలో శరీరం వణకటం అనేది మొదటి లక్షణంగా గుర్తించినప్పటికీ మూడోవంతు మందిలో భ్రాంతులు మొదటి లక్షణంగా కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది.

పరిశోధకులు 75మంది పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులను ఎంపిక చేసుకుని వారిపై తమ అధ్యయనం నిర్వహించారు. వీరంతా అరవై నుండి డెభై సంవత్సరాల మధ్య వయసున్నవారు. వీరిని ప్రశ్నించి వారి మెదడు పనితీరు ఎలా ఉందో అంచనా వేశారు. భ్రాంతులకు గురయినప్పుడు వారి మానసిక స్థితి ఎలా ఉందో కూడా కనుక్కున్నారు.

వ్యాధి మొదలైన మొదటి అయిదు సంవత్సరాల్లో బాధితుల్లో భ్రాంతికి గురయ్యే లక్షణం ఉంటే వారి మెదడులోని ఫ్రంటల్ లోబ్ భాగంలో క్షీణత చాలా వేగంగా జరగటం పరిశోధకులు గుర్తించారు. మెదడులోని ఫ్రంటల్ లోబ్ అనే భాగం పనితీరు బాగున్నపుడు ఏకాగ్రత, సమస్యలను పరిష్కరించే శక్తి, భావోద్వేగాల నియంత్రణ, అనాలోచితంగా కాకుండా ఆలోచించి పనిచేయటం వంటివి సవ్యంగా ఉంటాయి. పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల్లో ఫ్రంటల్ లోబ్ పనితీరు దెబ్బతినటం వలన ఈ అంశాల్లో సమర్ధతని కోల్పోతారు. దాంతో వారికి పనులు మొదలుపెట్టటం, వాటిని పూర్తిచేయటం కష్టంగా మారుతుంది. చూసేవారికి అది బద్దకంగా లేదా అనాసక్తిగా అనిపిస్తుంది. పార్కిన్సన్స్ ఉన్నవారిలో భ్రాంతులు ఉంటే తప్పకుండా వెంటనే వైద్యులకు ఆ విషయం చెప్పాలని పరిశోధకులు సూచిస్తున్నారు. చాలా సందర్భాల్లో భ్రాంతులను నిర్లక్ష్యం చేసి వైద్యులకు చెప్పకపోవటం లేదా అవి చికిత్స కారణంగా ఏర్పడుతున్న ప్రభావాలుగా అనుకుని వాటిని పట్టించుకోకపోవటం జరుగుతుందని, కానీ భ్రాంతులను నిర్లక్ష్యం చేయకూడదని వారు సలహా ఇస్తున్నారు.

భ్రాంతులు కాకుండా పార్కిన్సన్స్ వ్యాధిలో కనిపించే ఇతర లక్షణాలు

♦ చేతులు, కాళ్లు, దవడ కండరం, తల వణుకుతుంటాయి.

♦ కండరాలు బిగుసుకుపోతుంటాయి. శరీర కదలికలు కష్టంగా మారుతుంటాయి.

♦ శరీరంలో సంతులన స్థితి తగ్గుతుంది. బ్యాలన్స్ గా ఉండలేరు. దీనివలన పడిపోతుంటారు.

♦ డిప్రెషన్, ఇతర భావోద్వేగపరమైన మార్పులు వస్తుంటాయి.

♦ మింగటం, నమలటం, మాట్లాడటం కష్టంగా మారుతుంది.

♦ మూత్ర సంబంధమైన సమస్యలు, మలబద్ధకం, చర్మ సమస్యలు ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News