రాష్ట్రంలో మరో నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్
అవసరాలకు సరిపడేలా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ చేస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ
రాష్ట్రంలో మరో నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుత అవసరాలకు సరిపడేలా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నకిలీ, నాసిరకం మెడిసిన్ తయారు చేసి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను మంత్రి ఆదేశించారు. మంగళవారం వెంగళరావునగర్ లోని డీసీఏ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మెడిసిన్‌కు సంబంధించిన కంప్లైంట్ స్వీకరణ, ఆకస్మిక దాడుల కోసం స్టేట్ విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది 21,639 తనిఖీలు నిర్వహించి 3,416 సంస్థలపై చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. 1956లో ఏర్పాటు చేసిన ఒక్క ల్యాబ్ లో నెలకు 400 శాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేయగలుగుతామని, కొత్త ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉన్న ల్యాబ్ ను ఆధునీకరించడంతో పాటు నాలుగు కొత్త ల్యాబ్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి సూచించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల పెంపునకు ప్రపోజల్స్ ఇవ్వాలన్నారు. ఇంకో 80 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల మంజూరీ కోసం సీఎంతో చర్చిస్తానని మంత్రి తెలిపారు. మత్తు కలిగించే మెడిసిన్స్ అమ్ముతున్న వారిపై నిఘా పెట్టాలన్నారు. ప్రభుత్వం మందులు కొనుగోలు చేయడానికి ముందే ర్యాండమ్ గా శాంపిల్స్ పరీక్షించాలని సూచించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీసీఏ డీజీ విబి.కమలాసన్‌రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, డీసీఏ జేడీ రాందాన్ తదితరులు పాల్గొన్నారు.