బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు..30 మంది మృతి
వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కాగా.. 12 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు పాకిస్థాన్ సైన్యం వెల్లడి
పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన పరస్పర దాడిలో మొత్తం 30 మంది మృతి చెందారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కాగా.. 12 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో ఉగ్రవాదులు రోడ్డును బ్లాక్ చేయడానికి దుష్ట చర్యలకు యత్నించగా.. భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రతిఘటించారు. జనవరి 31-ఫిబ్రవరి 1 మధ్య కొనసాగిన ఈ ఆపరేషన్‌లో 18 మంది సైనికుల్ని కోల్పోయినట్లు పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. పిరికిపంద చర్యలతో ఉగ్రమూకలు బలూచిస్థాన్‌లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకుంటున్నారని తెలిపింది. ఉగ్రవాదుల దుష్ట పన్నాగాలను తిప్పికొట్టామని, 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపింది. ఈ క్రమంలో 18 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నది. ఈ ఘటన వెనక ఉన్నవారిని చట్టం ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నది. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ సంస్థా ఇంత వరకు ప్రకటన చేయలేదు.