డైమండ్స్ చోరీ.. సీసీ కెమెరాలను జల్లెడ పట్టి నిందితుడి అరెస్టు
చోరీ అయిన వాటిలో 97 శాతం రికవరీ
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టేయాలని ఆ దొంగ గాట్టిగా నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు. అందుకే ముంబయిలోని జ్యూయలరీ షాపులో రూ.1.50 కోట్ల విలువైన డైమండ్స్ కొట్టేశాడు. కొట్టేసిన డైమండ్స్ తో 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ముంబయి పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టి ఎట్టకేళకు దొంగను పట్టుకున్నారు. అంతేకాదు అతడి నుంచి చోరీ అయిన వాటిలో 97 శాతం డైమండ్స్ ను కూడా రికవరీ చేశారు. గోరేగావ్ లోని తమ జ్యూయలరీ షాపు నుంచి రూ.1.47 కోట్ల విలువైన 491 క్యారెంట్ల డైమండ్స్ చోరీ అయ్యాయని వ్యాపారి కిరణ్ రతీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు దొంగతనం చేసిన వ్యక్తిని సచిక్ జే మక్వానాగా గుర్తించారు. పోలీసులు మహారాష్ట్ర నుంచి రజస్థాన్ వరకు సీసీ కెమెరాలను జల్లెడ పట్టి మంగళవారం రజస్థాన్ లో దొంగను అరెస్టు చేశారు. అతడి నుంచి 1.40 కోట్ల విలువైన డైమండ్స్‌తో పాటు రూ.77,380లు రికవరీ చేశారు.