పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకుల మృతి
బీహార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన
రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా రైలు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన బీహార్‌లో చోటుచేసుకున్నది. పాట్నాలోని పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్-ముజఫర్‌పూర్ రైల్వే మార్గంలో పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా అదే మార్గంలో వచ్చిన రైలు వారిపై నుంచి దూసుకువెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యువకులు ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని ఉండటంతో తమ వైపు వస్తున్న రైలును గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మృతులను ఫర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించామన్నారు.
మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించామని తదుపరి విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. ఇటీవల పలువురు యువకులు ఈ విధంగా సేఫ్ కాని ప్రదేశాల్లో పరధ్యానంగా ప్రవర్తించడం వల్ల వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండటానికి బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులు, అధికారులు పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు.