Elon Musk | భార‌త్‌లో టెస్లా అధినేత మ‌స్క్ ప‌ర్య‌ట‌న వాయిదా.. కార‌ణాలివే..!

Elon Musk | గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ `టెస్లా` అధినేత ఎల‌న్‌మ‌స్క్ త‌న భార‌త్ ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేస్తున్న‌ట్లు శ‌నివారం ఉద‌యం ప్ర‌క‌టించారు.

Advertisement
Update:2024-04-20 13:18 IST

Elon Musk | గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ `టెస్లా` అధినేత ఎల‌న్‌మ‌స్క్ త‌న భార‌త్ ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేస్తున్న‌ట్లు శ‌నివారం ఉద‌యం ప్ర‌క‌టించారు. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం ఆది, సోమ‌వారాల్లో ఎల‌న్‌మ‌స్క్‌.. భార‌త్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంటుంది. భార‌త్‌లో ప‌ర్య‌ట‌న ప్రారంభానికి ఒక రోజు ముందు ఎల‌న్‌మ‌స్క్ త‌న ప‌ర్య‌ట‌న వాయిదా వేస్తున్న‌ట్లు `ఎక్స్ (మాజీ ట్విట్ట‌ర్‌)` వేదిక‌గా వెల్ల‌డించారు. `టెస్లా` సంస్థ కోసం చేప‌ట్టాల్సిన చాలా ముఖ్య‌మైన ప‌నుల కోసం త‌న భార‌త్ ప‌ర్య‌ట‌న వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఏడాది చివ‌ర్లో భార‌త్ ప‌ర్య‌ట‌న కోసం ఎదురు చూస్తున్న‌ట్లు పేర్కొన్నారు. త‌న రెండు రోజుల భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీ కావ‌డంతోపాటు దేశంలో పెట్టుబ‌డి ప్రణాళిక‌లు, టెస్లా మాన్యుఫ్యాక్చ‌రింగ్ యూనిట్ ఏర్పాటుపై ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది.

`టెస్లా సంస్థ కోసం చేప‌ట్టాల్సిన చాలా ముఖ్య‌మైన ప‌నుల కోసం దుర‌దృష్ట‌వ‌శాత్తు భార‌త్‌లో నా ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. కానీ, ఈ ఏడాది చివ‌ర్లో భార‌త్‌లో ప‌ర్య‌టించాల‌ని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా` అని ఈ ప్ర‌పంచ కుబేరుడు తెలిపారు. ఈ నెల 21న భార‌త్‌లో ఎల‌న్‌మ‌స్క్ ప‌ర్య‌టిస్తార‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చిన త‌ర్వాత గ‌త వారం.. `నేను భార‌త్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో భేటీ కోసం ఎదురుచూస్తున్నా` అని ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు.

గ‌తేడాది జూన్‌లో అమెరికాలో భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప‌ర్య‌టించిన‌ప్పుడు ఆయ‌న్ను ఎల‌న్‌మ‌స్క్ క‌లుసుకున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా భార‌త్ మార్కెట్‌లో టెస్లా ఎంట‌ర్ అవుతుంద‌ని హామీ ఇచ్చారు. భార‌త్‌లో 200-300 కోట్ల పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని ఎల‌న్‌మ‌స్క్ ప్ర‌క‌టిస్తార‌ని అంతా అంచ‌నా వేశారు. టెస్లాతోపాటు శాటిలైట్ బేస్డ్ ఇంట‌ర్నెట్ సేవ‌ల సంస్థ `స్టార్ లింక్‌`.. ఏర్పాటు చేస్తామ‌ని ఎల‌న్‌మ‌స్క్ ప్ర‌క‌ట‌న చేస్తారని అంచ‌నా.

అమెరికా కేంద్రంగా ఎల‌క్ట్రిక్ కార్లు త‌యారు చేస్తున్న టెస్లా అధినేత ఎల‌న్‌మ‌స్క్.. అమెరికా, చైనా దేశాల్లో ఆర్థిక మాంద్యం నేప‌థ్యంలో నిత్యం కొత్త మార్కెట్ల‌లో ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటార‌ని వార్త‌లొచ్చాయి. ప్ర‌పంచంలోకెల్లా అతిపెద్ద మార్కెట్ భార‌త్‌లో ఎంట్రీ కోసం మ‌స్క్ ఎక్కువ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించార‌ని స‌మాచారం. దేశీయంగా ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే దిగుమ‌తి కార్ల‌పై సుంకాలు త‌గ్గిస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే ప్ర‌క‌టించింది.

శాటిలైట్ ఆధారిత ఇంట‌ర్నెట్ సేవ‌ల ప్రారంభానికి ఎల‌న్‌మ‌స్క్ సారధ్యంలోని `స్టార్‌లింక్‌` కు లైసెన్స్ మంజూరు ప్ర‌క్రియ ప్రారంభ‌మైందని స‌మాచారం. అంత‌రిక్ష రంగంలో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ (ఎఫ్‌డీఐ)కు అనుమ‌తించేందుకు కేంద్రం మార్పులు చేస్తూ నోటిఫికేష‌న్ జారీ చేసింది.

Advertisement

Similar News