అమ్మకానికి గూగుల్ క్రోమ్...?
క్రోమ్ బ్రౌజర్‌ను అమ్మకానికి పెట్టేలా పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌పై ఒత్తిడి చేయాలని డీవోజే కోరనున్నట్టు ప్రచారం
గూగుల్ ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించడానికి దాని క్రోమ్ బ్రౌజర్‌ను అమ్మకానికి పెట్టేలా పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్ ఆఫ్ జస్టిస్ (డీవోజే) కోరనున్నది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ పత్రిక కథనంలో పేర్కొన్నది. గూగుల్ సెర్చ్ మార్కెట్‌లో అక్రమంగా ఏకఛత్రాధిపత్యం సాధించిందని ఆగస్టులో రూలింగ్ ఇచ్చిన జడ్జి వద్దనే ఈ ప్రతిపాదన ఉంచాలని డీవోజే కోరనున్నదని ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు కృత్రిమ మేధ, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధిత చర్యలను సూచించాలని ఆ జడ్జిని కోరనున్నది.
ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి డీవోజే నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు ఆ గూగుల్ ప్రతినిధి మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. 'డీవోజే ఓ ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తున్నది. ప్రస్తుత కేసులోని చట్టాల పరిధిని దాటి ఇది ఉన్నది. వినియోగదారులను ఇది నష్టపరుస్తుంది' అని గుగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే మల్హోలాండ్ పేర్కొన్నారు.
బడా టెక్ కంపెనీల ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టడానికి బైడెన్ ప్రభుత్వం తీసుకున్న దూకుడు నిర్ణయంగా దీన్ని భావిస్తున్నారు. కానీ ట్రంప్ 2024 ఎన్నికల్లో గెలవడం కూడా ఈ కేసుపై ప్రభావం చూపెడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ రెండు నెలల ముందు ఓ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ.. గూగుల్ తన విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరించారని ఆరోపించారు. కానీ ఒక నెల తర్వాత కంపెనీని విచ్ఛిన్నం చేయడం మంచి ఐడియా కాదా? అంటూ ప్రశ్నించారు. వచ్చే ఏడాది గూగుల్ కేసుకు సంబంధించి అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి మెహతా తీర్పును వెలువరించనున్నారు. దీనిపై అప్పీలుకు వెళ్లాలని ఆ సంస్థ భావిస్తున్నది. మరోవైపు ప్రాసిక్యూటర్లు మాత్రం కోమ్ విక్రయమే కాకుండా మరిన్ని ప్లాన్‌ల కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా యాపిల్ సహా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గూగుల్ బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లిస్తున్నది. దీనికి ప్రతిగా ఆ కంపెనీలు ఈ బ్రౌజర్‌నే డీఫాల్ట్‌గా తమ టాబ్లెట్లు, ఫోన్లలో ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఉంచుతున్నాయి. ఇలా ఒప్పందాలను ఆపేయడం ప్రాసిక్యూటర్ల ప్లాన్లలో ఉన్నది.