అక్కడ రూ.100కే కేజీ చికెన్
కొనేందుకు బారులు తీరిన మాంసాహార ప్రియులు
కేజీ చికెన్ ధర ఎంత? సాధారణంగా రూ.200కు కాస్త అటుఇటుగా ఉంటుంది. కార్తీక మాసంలో ఎక్కువ మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. అందుకే ధర కొంత మేరకు తగ్గుతుంది. ఎండాకాలంలో కోళ్ల ఫామ్‌ల నిర్వహణ భారం ఎక్కువగా ఉంటుంది.. పెంపకానికి షెడ్లలో వేసిన కోడిపిల్లలన్నీ బతుకవు.. అందుకే ధర రూ.300లకు పైగా పలుకుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఒక జిల్లాలో కేజీ చికెట్ ధర వంద రూపాయలు మాత్రమే. కార్తీకమాసం కారణంగా ధర తగ్గించలేదు. తాను అభిమానించే రాజకీయ పార్టీ కోసం ఇద్దరు చికెన్ సెంటర్ల నిర్వాహకులు ధర తగ్గించారు.. ఇంతకీ అది ఎక్కడా అంటున్నారా? కర్నూల్ లోని మద్దూర్ నగర్ లో షమీర్, సుభాన్ చికెన్ సెంటర్ల వద్ద ఆదివారం రూ.100కే కేజీ చికెన్ అమ్మారు. తక్కువ ధరకే చికెన్ అమ్ముతుండటంతో మాంసాహార ప్రియులు చికెన్ కొనేందుకు ఎగబడ్డారు. తాను అభిమానించే తెలుగుదేశం పార్టీ కోసమే తక్కువ ధరకు చికెన్ అమ్ముతున్నానని అందులో ఒక చికెన్ సెంటర్ నిర్వాహకుడు చెప్పారు.