భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చింది?
అధికారులను ప్రశ్నించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం.. తొక్కిసలాటలో భక్తుల ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్‌కు వివరించారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్క్‌కు వచ్చారని అధికారులు వివరించారు. అనంతరం తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగింది. క్షమించమని బాధితులను అడిగాను. బాధ్యత తీసుకుంటున్నాం. ఎప్పుడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదు. పోలీసులకు క్రౌడ్ మేనేజ్ మెంట్ అలవాటు కాలేదు. భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో విఫలమయ్యారు. అధికారుల తప్పులకు మేం తిట్లు తింటున్నాం. టీటీడీ ఈవో, ఏఈవో బాధ్యత తీసుకోవాలి. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరగాలని పవన్ అన్నారు.