తిరుమలలో భారీ వర్షం.. శ్రీవారి మెట్టు వద్ద భక్తులకు నో ఎంట్రీ

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఏఎన్సీ కాటేజ్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద భారీ వృక్షాలు నేలకొరిగాయి. కాసేపు రాకపోకలు స్తంభించాయి.

Advertisement
Update:2023-12-04 15:35 IST

మిచౌంగ్ తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. కొండపైన చెట్లు నేలకొరిగాయి. వర్షం ధాటికి భక్తుల కదలికలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. విడవకుండా వర్షం కురుస్తుండటంతో తిరుమల యాత్రికులు ఇబ్బందిపడుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఏఎన్సీ కాటేజ్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద భారీ వృక్షాలు నేలకొరిగాయి. కాసేపు రాకపోకలు స్తంభించాయి. చెట్లు కూలిన సమయంలో భక్తులెవరూ ఆ కాటేజీల వద్ద లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

శ్రీవారి మెట్టు మూసివేత..

భారీ వర్షంతో శ్రీవారి మెట్టు మార్గంలో వర్షపు నీరు మెట్లపైనుంచి కుండపోతగా కిందకు వస్తోంది. మెట్ల మార్గం ప్రమాదకరంగా మారింది. దీంతో టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తగా శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలిచ్చేవరకు భక్తులెవర్నీ శ్రీవారి మెట్టు వద్దకు అనుమతించబోమని చెప్పారు. యాత్రికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

దర్శనీయ స్థలాలకు అనుమతి రద్దు..

మరోవైపు తిరుమలలోని దర్శనీయ స్థలాలకు కూడా భక్తుల అనుమతి రద్దు చేసింది టీటీడీ. పాపవినాశనం మార్గంలోని పలు ప్రదేశాల్లో చెట్లు కూలిపోవడం, రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో భక్తులను అటు వెళ్లనివ్వడంలేదు. శ్రీవారి పాదాలు, శిలాతోరణం వైపు కూడా భక్తులను వెళ్లనీయడంలేదు. దర్శనం తర్వాత మిగతా ప్రాంతాలకు వెళ్లకుండానే భక్తులు తిరుగు ప్రయాణమవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News