తమ్ముళ్ళల్లో బీపీ పెరిగిపోతోందా..?
గతంలో నరేంద్రమోడీపై నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు ఇప్పుడు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని అమిత్ షా షరతు విధించినట్లు జగన్ మీడియా చెప్పింది.
ఢిల్లీ కేంద్రంగా మొదలైన పరిణామాలతో తమ్ముళ్ళల్లో బీపీ ఫుల్లుగా పెరిగిపోతున్నట్లుంది. గురువారం రాత్రి 10.30 గంటల నుండి 12 వరకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పొత్తు చర్చలు జరిపారు. దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపినా పొత్తులపై తేలలేదు. అమిత్, నడ్డాలు అడిగిన సీట్లు, చంద్రబాబు ఇస్తామని చెప్పిన సీట్ల మధ్య బాగా తేడా ఉండటం వల్లే చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. అలాగే చంద్రబాబు విషయంలో అమిత్ పెట్టిన కండీషన్ కూడా ఒక కారణంగా తెలుస్తోంది.
విషయం ఏమిటంటే.. టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకోవాలంటే 8-10 లోక్ సభ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే అని అమిత్ కచ్చితంగా అడిగారట. అలాగే గతంలో నరేంద్రమోడీపై నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు ఇప్పుడు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని అమిత్ షా షరతు విధించినట్లు జగన్ మీడియా చెప్పింది. వైసీపీ గెలవకూడదంటే బీజేపీ 4 పార్లమెంటు సీట్లు, 6 అసెంబ్లీ సీట్లకు పరిమితమవ్వాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారట. ఇంతకన్నా ఎక్కువసీట్లు బీజేపీ తీసుకుంటే వైసీపీకే లాభం జరుగుతుందని చంద్రబాబు వివరించారట.
చంద్రబాబు, పవన్ తో భేటీకి ముందు రాష్ట్ర బీజేపీలోని ముఖ్యనేతలతో అమిత్, నడ్డాలు మాట్లాడారట. ఈ చర్చల్లో 8-10 పార్లమెంటు సీట్లు, 20 అసెంబ్లీల్లో బీజేపీ గెలుపు అవకాశాలున్నాయని చెప్పారట. పార్టీ గెలుస్తుందని అనుకుంటున్న సీట్ల జాబితాను కూడా రాష్ట్రనేతలు అమిత్ కు ఇచ్చారట. దాని ఆధారంగానే చంద్రబాబు, పవన్ భేటీలో పార్లమెంటు, అసెంబ్లీ సీట్ల విషయంలో కచ్చితంగా మాట్లాడినట్లు సమాచారం.
సీట్ల విషయమై చర్చలు ఎంతకీ కొలిక్కి రాకపోవటంతో శుక్రవారం మరోసారి భేటీ అవుదామని చెప్పి అమిత్ వీళ్ళిద్దరినీ పంపించేశారు. మరి శుక్రవారం అమిత్ షా మళ్ళీ చంద్రబాబు, పవన్ను చర్చలకు ఎప్పుడు పిలుస్తారు, ఏమి మాట్లాడుతారన్న విషయంలో అందరిలో టెన్షన్ పెరిగిపోతోంది. నరసాపురం, రాజమండ్రి, రాజంపేట, అరకు, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం, హిందూపురం, తిరుపతి స్ధానాల్లో బీజేపీ పోటీచేయాలని అనుకుంటున్నట్లు చంద్రబాబుకు అమిత్ చెప్పినట్లు తెలుస్తోంది. గ్రౌండ్ రిపోర్టు ప్రకారం శుక్రవారం రాత్రిలోగా పొత్తులు ఫైనల్ అవుతాయని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.