జగన్ తప్పు వల్లే టీడీపీ గెలుస్తోందా?

పార్టీ నేతలు విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేస్తే అభ్యర్థి గెలుపు కష్టమేమీకాదు. వైసీపీలోని అంతర్గత గొడవల వల్లే బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు. మరి దీపికకు పార్టీలోని నేతలు, క్యాడర్ ఏమాత్రం సహకరిస్తారో చూడాలి.

Advertisement
Update:2023-07-07 11:01 IST

పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పు వల్లే పార్టీ హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోతోంది. రెండు వరుస ఎన్నికల్లో 2014, 2019లో పార్టీ ఓడిపోయింది. టీడీపీ తరపున గెలిచిన నందమూరి బాలకృష్ణ నియోజకవర్గానికి అతిథిగా వచ్చి వెళుతున్నారు. ఎక్కువ భాగం ఉంటే షూటింగుల్లోనో లేకపోతే హైదరాబాద్‌లో మాత్రమే ఉంటారు. నియోజకవర్గంలోని ఏ సమస్యనూ పట్టించుకోరు. తనకు తీరికున్నపుడు మాత్రమే వచ్చి నియోజకవర్గంలో ఒకటి రెండు రోజులుండి వెళిపోతుంటారు.

నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్ళే బాలకృష్ణకే జనాలు ఓట్లేసి ఎందుకు గెలిపిస్తున్నారు? హిందుపురంలోనే ఉంటున్న నవీన్ నిశ్చల్ వరుసగా మూడు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2009లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. నవీన్‌కు నియోజకవర్గంలో పట్టుంది. అయితే ఇతర నేతలు, క్యాడర్ పూర్తిగా సహకరించటంలేదు. అందుకనే ఓడిపోయారు. 2019లో గెలుస్తారని అనుకుంటే అసలు టికెట్టే దక్కలేదు.

జగన్ ఇక్కడే తప్పు చేశారు. నియోజకవర్గంలో బాగా పాపులరైన నవీన్‌ను కాదని అంతకుముందే రిటైరయిన మహ్మమద్ ఇక్బాల్‌కు టికెటిచ్చారు. దాంతో ఆయన ఓడిపోయారు. హిందుపురం వైసీపీలో గ్రూపుల గోలతోనే రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. 2019లో ఇక్బాల్ ఓడిపోగానే వెంటన ఎమ్మెల్సీని చేశారు. ఆ తర్వాత మళ్ళీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించారు. ఇక్బాల్ కారణంగా నియోజకవర్గంలో గొడవలు బాగా పెరిగిపోయాయి.

మధ్యలో చవుళూరి రామకృష్ణారెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు. ఆయ‌న‌ నియోజకవర్గంలో బాగా పర్యటిస్తు అందరినీ కలుపుకుని వెళుతున్న సమయంలో సడెన్‌గా హత్యకు గురయ్యారు. ఇక్బాలే హత్య చేయించినట్లు పార్టీ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. అప్పటి నుండి మరింతగా గొడవలు పెరిగిపోయాయి. చివరకు ఇక్బాల్‌ను పక్కనపెట్టి మంగళవారం టీఎన్ దీపికను ఇన్‌చార్జిగా జగన్ ప్రకటించారు. మరి పోటీ చేసే అవకాశం దీపికకే ఇస్తారా లేదా తెలియ‌దు. పార్టీ నేతలు విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేస్తే అభ్యర్థి గెలుపు కష్టమేమీకాదు. వైసీపీలోని అంతర్గత గొడవల వల్లే బాలకృష్ణ రెండు సార్లు గెలిచారు. మరి దీపికకు పార్టీలోని నేతలు, క్యాడర్ ఏమాత్రం సహకరిస్తారో చూడాలి.

Advertisement

Similar News