కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ రచ్చ
సానా సతీశ్ ఎంపికకు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ససేమిరా
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ ఉప ఎన్నికలు రచ్చ సృష్టిస్తున్నాయి. మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒక్కొక్కరిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారు. టీడీపీ సభ్యుడి విషయంలోనే పీఠముడి పడింది. సోమవారం తాడేపల్లిలో నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుతో డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికతో పాటు పలు అంశాలు వీరిపై చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి సానా సతీశ్ పేరును చంద్రబాబు ప్రతిపాదించినట్టుగా సమాచారం. ఆయన ఎంపికపై తన అభ్యంతరాలను పవన్ కళ్యాణ్ ఇదే సమయంలో కుండబద్దలు కొట్టినట్టుగా తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా గతంలో మీడియాలో అనేక కథనాలు ప్రసారం అయ్యాయని, అలాంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం సరికాదని కూడా పవన్ చెప్పినట్టుగా కూటమి నేతల మధ్య చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి సాన సతీశ్ కాకుండా మరొకరికి అవకాశమిస్తేనే తాము మద్దతిస్తామని కూడా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పనట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రియాక్షన్ తర్వాత చంద్రాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఒకవేళ పవన్ కళ్యాణ్ మాటను కాదని బాబు సానా సతీశ్ వైపే మొగ్గు చూపితే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ మొదలైంది.
ఏపీ అసెంబ్లీలో సంఖ్యబలం రీత్యా మూడు రాజ్యసభ స్థానాలను టీడీపీ గెలుచుకునే అవకాశాలున్నాయి. జనసేన, బీజేపీపి కలిపి 29 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా శాసన మండలి స్థానాలు, నామినేటెడ్ పోస్టులను సైతం మూడు పార్టీల నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటి వరకు పదవుల పంపకాలు సజావుగానే సాగిపోయాయి. కొన్ని పొరపొచ్చాలున్నా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. చంద్రబాబు ప్రతి సమావేశంలోనూ పవన్ కళ్యాణ్ ను పొగడ్తల్లో ముంచెతుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాన సతీశ్ కు రాజ్యసభ టికెట్ వ్యవహారం టీ కప్పులో తుపానులా సమసి పోతుందా? భవిష్యత్ రోజుల్లో కూటమికి బీటలు వారుస్తుందా అనే చర్చ కూడా సాగుతోంది. టీడీపీ ఎన్‌డీఏ కూటమి నుంచి వచ్చే సాహసం చేయకపోవచ్చని.. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక విషయంలో సర్దుకుపోయే ధోరణి ప్రదర్శిస్తారనే చర్చ కూడా సాగుతోంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ ఎంపీల మద్దతుతోనే కొనసాగుతోంది. కానీ చంద్రబాబు, నితీశ్ కుమార్ ప్రధాని నరేంద్రమోదీని కాదని ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు కనుక ఎన్‌డీఏ నుంచి బయటకు వస్తే కేసులు బయటికి తీసి వేధింపులకు పాల్పడుతారనే అనుమానాలున్నాయి. పవన్ కళ్యాణ్‌ను ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టి వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా పావులు కదుపుతారనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సానా సతీశ్ కోసం చంద్రబాబు పట్టుబడతారా? పవన్ కళ్యాణ్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మరొకరిని ఎంపిక చేస్తారా అనేది ఒకటి, రెండు రోజుల్లోనే తేలనుంది.