తిరుమలలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు
ఫెంజల్ తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు
ఫెంజల్ తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లను తొలిగిస్తున్నారు.
మరోవైపు తిరుమలలో రెండురోజులుగా పడుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపుగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నది.
ఫెంజల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా విశాఖ-తిరుపతి విమాన సర్వీసులను రద్దు చేశారు.బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంజల్ తుపాను శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని తాకింది. తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులు, కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. పుదుచ్చేరిలో పర్యాటక ప్రాంతాలనూ మూసేశారు.