టేబుళ్లు మారలేదు.. నినాదం మారిందంతే..

అప్పట్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి విద్యార్థులను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న జగన్, తీరా ప్రత్యేక హోదా విషయం వచ్చే సరికి సైలెంట్ గా ఉన్నారని, కేంద్రంతో లాలూచీపడ్డారని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు.

Advertisement
Update:2022-11-02 18:33 IST

గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఏపీకి ప్రత్యేక హోదాపై అన్ని జిల్లాల్లోనూ సమావేశాలు జరిగాయి. టీడీపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు రాలేకపోయారని, హోదా వస్తే మన జీవితాలే మారిపోతాయంటూ వైఎస్ జగన్ చెప్పేవారు. పాతికమంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామనేవారు. అటు విద్యార్థులు కూడా అంతే ఆవేశంగా జిల్లా సమావేశాల్లో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధించి తీరతామని, హోదాకోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధమని మాట్లాడారు. ఇప్పుడా పాత వీడియోలన్నిటినీ టీడీపీ వెలికి తీస్తోంది. ట్విట్టర్లో షేర్ చేస్తూ వైసీపీకి ప్రశ్నలు సంధిస్తోంది. ఎందుకంటారా..? ఇప్పుడు కూడా ఏపీలో ఇలాంటి సమావేశాలే జరుగుతున్నాయి. విద్యార్థులు, నాన్ పొలిటికల్ జేఏసీలతో వైసీపీ నేతలు సమావేశమవుతున్నారు. ఏపీకి మూడు రాజధానులు కావాల్సిందేనంటూ తీర్మానాలు చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామాలు చేస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు.

టేబుల్ రిపీట్.. సీన్ రిపీట్..

అప్పట్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి విద్యార్థులను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న జగన్, తీరా ప్రత్యేక హోదా విషయం వచ్చే సరికి సైలెంట్ గా ఉన్నారని, కేంద్రంతో లాలూచీపడ్డారని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పుడు అధికారం చేతిలో ఉండి కూడా మూడు రాజధానులకోసం ఉద్యమం అంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అప్పట్లో అధికారం కోసం అసత్యాలు చెప్పారనుకున్నా, ఇప్పుడు అధికారం చేతుల్లో ఉండి కూడా మూడు రాజధానులపై నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారని, ఉద్యమం పేరుతో హడావిడి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

విద్యార్థుల భాగస్వామ్యంతో ఏం జరుగుతుంది..?

మూడు రాజధానులు కావాల్సిందే, వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అంటూ నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు, విద్యార్థులు ఆవేశంగా ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు టేబుళ్ల చుట్టూ చేరిన నేతలే గతంలో ప్రత్యేక హోదా కోసం ఆవేశంగా ప్రసంగించారు కదా, ఆ సంగతేమైంది అని ప్రశ్నిచడం మాత్రం మరచిపోయారు. అవే పాత టేబుళ్లు, కాకపోతే ఇప్పుడు నినాదం మారింది. మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యం, మూడు రాజధానులకోసం మన పోరాటం అంటూ విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు సంయుక్తం గర్జిస్తున్నారు. మరి ఈ గర్జనలు ఎవరిని భయపెట్టడానికి..? ఏం సాధించడానికి..? ముందు ముందు తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News