షర్మిల పేరెత్తలేదు కానీ.. ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చిన జగన్
ఆమెను చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ అంటూ చెణుకులు విసిరారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ చురకలంటించారు.
జగన్ వర్సెస్ షర్మిల.. మాటల యుద్ధం ఏపీలో రసవత్తరంగా సాగుతోంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్నపై విరుచుకు పడుతున్న చెల్లెలికి.. ఆ అన్న తిరిగి బదులిచ్చేశారు. ఆమెను చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ అంటూ చెణుకులు విసిరారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ చురకలంటించారు. ఎవరెవరు చంద్రబాబుకోసం పనిచేస్తున్నారో సోదాహరణంగా వివరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. వైరి వర్గాలన్నిటికీ కలిపి ఫుల్ డోస్ ఇచ్చేశారు.
చంద్రబాబును మోసే ముఠా ఒకటి ఉందని, ఆయన ఏ మంచి చేయకపోయినా ఢంకా బజాయించేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్‌లు ఉన్నారన్నారు జగన్. అయితే వాళ్లంతా పక్క రాష్ట్రంలో ఉన్నారన్నారు. దత్తపుత్రుడు..ఒక స్టార్ క్యాంపెయినర్ ఒకరైతే, ఆయన వదిన గారు పక్క పార్టీలోకి వెళ్లి మరోస్టార్ క్యాంపెయినర్‌గా మారారన్నారు. పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా అధిపతులతో చంద్రబాబుకు క్యాంపెయినింగ్ చేస్తుంటారన్నారు జగన్. అమరావతిలో బాబు బినామీలు ఉన్నట్లే.. ఇతర పార్టీల్లో చంద్రబాబు బినామీలు స్టార్ క్యాంపెయినర్‌లు గా ఉన్నారు. కానీ తనకు మాత్రం ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని వివరించారు జగన్. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన.. ప్రతి ఇళ్లు, ఆ ఇళ్లలోని అక్కాచెల్లెమ్మలే తన స్టార్ క్యాంపెయినర్‌లు అని అన్నారాయన.
రాష్ట్రంలో 56 నెలల కాలంలో జరిగిన మంచిపై సంతోష పడుతున్నానని చెప్పారు సీఎం జగన్. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామని, డ్వాక్రా మహిళల ఖాతాల్లో కోట్లు జమ చేశామని, మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందుంటుందన్నారు. కుట్రలు కుతంత్రాలు జెండాలు జత కట్టడమే వాళ్ల ఎజెండా అని, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా అని చెప్పారు.