పోలింగ్ సిబ్బందిపై వేటు.. ఈసీ చర్యలు మరీ ఘోరం

ఇక పిన్నెల్లి వీడియో విషయంలో ఏపీ సీఈఓ మాటలు అమాయకత్వానికి పరాకాష్టగా మారాయి. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ఎలా బయటకు వెళ్లిందో తనకు తెలియదన్నారాయన.

Advertisement
Update:2024-05-23 15:46 IST

మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టిన ఘటనలో పాల్వాయిగేట్ పోలింగ్ ఆఫీసర్(PO), అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్(APO)పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. వారిద్దర్నీ సస్పెండ్ చేసింది. సరైన సమాచారం ఇవ్వనందున వారిద్దర్నీ సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చామన్నారు ఏపీ సీఈఓ ముకేష్ కుమార్ మీనా. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. పిన్నెల్లి అరెస్టు విషయంలో ఈసీ సీరియస్‌గా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

ఈనెల 13న ఈవీఎం పగలగొట్టిన ఘటన జరిగింది. అదే రోజు వెబ్ క్యాస్టింగ్ లో ఆ ఘటన వీడియో ఫుటేజీ రికార్డ్ అయింది. ఈవీఎం పగలగొట్టనప్పుడు హడావిడి జరిగితే అక్కడున్న పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నట్టు..? వెంటనే ఆ సమాచారం పై అధికారులకు ఫిర్యాదు చేసే ఉంటారు. మరి ఎస్పీ సహా ఇతర అధికారులు ఏం చేస్తున్నారు. వెబ్ క్యాస్టింగ్ పరిశీలించే కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టర్ అధీనంలో ఉంటుంది. ఆరోజు వీడియో రికార్డ్ అయితే కలెక్టర్ ఏం చేస్తున్నట్టు. ఇన్ని తప్పులు చేశారు కాబట్టే వారిని ఈసీ ముందుగానే సస్పెండ్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు వస్తుండేసరికి తూతూ మంత్రంగా పీఓ, ఏపీఓపై వేటు వేసినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన 10రోజులకు పోలింగ్ సిబ్బందిపై వేటు వేయడమేంటనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

ఇక పిన్నెల్లి వీడియో విషయంలో ఏపీ సీఈఓ మాటలు అమాయకత్వానికి పరాకాష్టగా మారాయి. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ఎలా బయటకు వెళ్లిందో తనకు తెలియదన్నారాయన. ఆ వీడియో ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని, దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లిందన్నారు. అధికారుల చేతుల్లో ఉండాల్సిన వీడియో ఫుటేజీ నారా లోకేష్ ట్వీట్ ద్వారా బయటపడటంతో ఈసీపై విమర్శలు జోరందుకున్నాయి. దాన్ని కవర్ చేసుకోడానికి ఇప్పుడు అధికారులు తంటాలు పడుతున్నారు.

మాచర్ల వ్యవహారంలో రోజు రోజుకీ కొత్త ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి. ఈవీఎం పగలగొట్టడంతోపాటు ఆరోజు చాలానే అరాచకాలు జరిగాయి. వాటిని ఏమాత్రం బయటకు రానివ్వడంలేదు. టీడీపీ మీద తప్పులేకుండా చేసేందుకే ఈసీ ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హౌస్ అరెస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేని ఇల్లు దాటించి, ఇప్పుడు అరెస్ట్ పేరుతో హడావిడి చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. వీడియో బయటకు వచ్చిన తర్వాతే వ్యవస్థల్లో కదలిక వచ్చిందని, అప్పటి వరకు ఆ విషయం వారికి తెలిసినా సైలెంట్ గా ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News