జనసైనికులు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పిన పవన్ కళ్యాణ్
పార్టీలోని నేతలు, వీర మహిళలు, జనసైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది.అందువల్ల ప్రతిఒక్కరూ మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలని, స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్టు సభ్య సమాజం భావించని రీతిలో మన మాటలు ఉండాలని పవన్ జనసైనికులను కోరారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం జనసేన పార్టీ నిరంతరం శ్రమిస్తున్నదని, ఇలాంటి తరుణంలో, మన దృష్టిని మరల్చి, జనసేన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. జనసైనికులు, వీరమహిళలు ఈ విషయాలను అర్దం చేసుకొని ప్రవర్తించాలని ఆయన అన్నారు.
జనసేన పట్ల సానుకూలంగా ఉన్న పార్టీల్లో ఆ సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసేవిధంగా కల్పిత సమాచారాన్ని కొందరు ప్రచారం చేస్తున్నారని వారి పట్ల జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కోరారు.
పార్టీలోని నేతలు, వీర మహిళలు, జనసైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది.
అందువల్ల ప్రతిఒక్కరూ మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలని, స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్టు సభ్య సమాజం భావించని రీతిలో మన మాటలు ఉండాలని పవన్ జనసైనికులను కోరారు.
ఎవ్వరిపైన కూడా ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయవద్దని, అది పార్టీకి, సమాజానికి కూడా మంచిది కాదన్నారు పవన్.
ముఖ్యంగా ఈ కింది విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని పవన్ ప్రకటించారు.
1. సరైన ఆధారాలు, తగిన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైన కూడా ఆర్థిక నేరారోపణలు చేయకండి.
2. మీడియాలో వచ్చిందనో, ఎవరో మాట్లాడారనో... నిర్ధారణ కాని అంశాల గురించి మాట్లాడొద్దు.
3. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా పొత్తుల గురించి మాట్లాడొద్దు. పొత్తుల విషయంలో మేలు చేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటాను.
4. మనతో మంచిగా ఉండే పార్టీలలోని చిన్న చితకా నేతలు మనపై ఏవైనా విమర్శలు చేస్తే, అవి నాయకుని వ్యక్తిగత విమర్శలుగానే భావించండి. అంతేతప్ప, ఆ వ్యాఖ్యలను ఆయా పార్టీలకు ఆపాదించవద్దు. అని ఈ రోజు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఓ ప్రకటన పోస్ట్ చేశారు.