ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన చంద్రబాబు, లోకేశ్
ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు పోలింగ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేశ్ చేరుకుని ఓటు వేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ (కూటమి తరఫున), కేఎస్ లక్ష్మణరావు (పీడీఎప్ తరఫున) మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని తెలిపారు.