వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అసహనం
సాక్షి సహా నాలుగు ఛానళ్లపై ప్రభుత్వం ఆంక్షలు
అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు రెండోరోజు ప్రారంభం కాగానే ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారని (జగన్‌ను ఉద్దేశించి) వ్యాఖ్యానించారు. తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చుని నవ్వుకుంటారా? అని ప్రశ్నించారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూఆ జగన్ చేసేది తప్పదని చెప్పలేదని ఆక్షేపించారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదని.. ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలన్నారు.
సాక్షి కథనంపై సభా హక్కుల కమిటీ రిఫర్
సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని స్పీకర్ నిర్ణయించారు. సభా హక్కుల కమిటీకి ఆ పత్రిక కథనాలను రిఫర్ చేశారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండా రూ. కోట్లు వెచ్చించారంటూ తప్పుడు కథనం రాశారని నందికొట్కూర్ ఎమ్మెల్యే జయసూర్య ప్రభ సభ దృష్టికి తీసుకొచ్చారు. సాక్షి మీడియాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ స్పందిస్తూ సభా హక్కుల కమిటీ రిఫర్ చేశారు.
సాక్షి సహా నాలుగు ఛానళ్లపై ఆంక్షలు
మరోవైపు అసెంబ్లీలో సాక్షి టీవీ సహా నాలుగు ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరించారు. దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని విధంగా ప్రభుత్వ ఆంక్షలు విధించడం ఇదే మొదటిసారి అని జర్నలిస్టు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాయి.