పోలీసులు రోడ్డుపై కూర్చుంటారా..? సిగ్గు సిగ్గు
ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన లాంటి మాటలకు వైసీపీ ప్రభుత్వానికి అర్థం తెలుసా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఏపీలో పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం లేదన్నారు.
చంద్రబాబు అనపర్తి పర్యటనను పోలీసులు అడ్డుకోవడం, టీడీపీ కార్యకర్తలు తోపులాటకు దిగడం తెలిసిందే. చంద్రబాబు పర్యటనను ముందుకు సాగనీయకుండా ఓ దశలో పోలీసులు రోడ్డుపై బైఠాయించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిరసన తెలపడానికి సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారంటే అర్థముంది, అలాంటిది పోలీసులు వైసీపీ కార్యకర్తల్లాగా రోడ్డుకి అడ్డంగా కూర్చోవడం ఏంటని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేతలకు మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారాయన.
ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన లాంటి మాటలకు వైసీపీ ప్రభుత్వానికి అర్థం తెలుసా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఏపీలో పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం లేదన్నారు.
ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా ఒక పార్టీ అధినేత పర్యటనకు వెళ్తే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారంటే, వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న పనులు అప్రజాస్వామికంగా ఉన్నాయని విమర్శించారు.
అప్పుడు నన్ను కూడా..
జనవాణి కార్యక్రమం కోసం తాను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో ఏ విధంగా బంధించారో ప్రజలు చూశారన్నారు పవన్ కల్యాణ్. నడుస్తుంటే నడవకూడదన్నారు, కారులో వెళ్లకూడదన్నారు, సవాలక్ష ఆంక్షలుపెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని సహించలేని స్థితికి వైసీపీ పాలకులు చేరుకున్నారని విమర్శించారు. ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంటే పాలకులకు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు పవన్ కల్యాణ్.