పవన్‌ నోట.. ఎంపీ మాట..

పార్టీ నేతల సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తాను పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, అవసరమైతే కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు.

Advertisement
Update:2024-03-20 09:11 IST

పవన్‌ కల్యాణ్‌ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయడం లేదని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని గతంలో వచ్చిన ఊహాగానాలకు ఇటీవలే చెక్‌ పెట్టిన విషయం తెలిసిందే. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి ఆ అంశంపై క్లారిటీ ఇచ్చిన పవన్‌.. ఇప్పుడు మళ్లీ ఎంపీ మాట ఎత్తారు. భవిష్యత్తులో అవసరమైతే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమేనని ఆయన మంగళవారం ప్రకటించారు. దీంతో మరోసారి ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ నేతల సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తాను పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, అవసరమైతే కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. కేంద్ర నాయకత్వం తనను రెండుచోట్లా పోటీ చేయాలని అడిగారని, ఎంపీగాను, ఎమ్మెల్యేగాను పోటీ చేయాలని చెప్పారని పవన్‌ వెల్లడించారు. తనకైతే ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉందని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో మోడీ, అమిత్‌షా అడిగితే ఎంపీగా వెళ్లాల్సి వస్తే కాకినాడ నుంచి లోక్‌సభకు తాను పోటీ చేస్తానని పవన్‌ చెప్పారు.

తన సీటుపై తనకే క్లారిటీ లేని స్థితిలో పవన్‌...

ఇదంతా చూస్తే.. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్‌ కల్యాణ్‌కి తాను ఎక్కడినుంచి పోటీ చేయాలనే క్లారిటీ తనకే ఇప్పటివరకు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా.. ఇప్పటికీ తన సీటు పైనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న పవన్‌.. ఇక పార్టీని, తనను నమ్ముకున్న కేడర్‌కి ఎలాంటి భరోసా ఇవ్వగలడని ఆ పార్టీ శ్రేణుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌ ఏ స్థానం నుంచి పోటీ చేయాలనేది బీజేపీనో, చంద్రబాబో నిర్ణయించే పరిస్థితుల్లో ఉంటే.. ఇక ఒక పార్టీ అధినేతగా ఆయనకున్న విలువ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

టీడీపీపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు...

పవన్‌ కల్యాణ్‌ మరోసారి టీడీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పదేళ్లుగానే రాజకీయాల్లో ఉన్నప్పటికీ 40 ఏళ్ల టీడీపీకి తానే అండగా నిలవాల్సి వచ్చిందని జనసేన కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. జనసేనే లేకపోతే ఈ పొత్తు కూడా ఉండేది కాదని గతంలో చేసిన వ్యాఖ్యలనే పునరుద్ఘాటించారు. పొత్తుల కోసం అందరినీ ఒప్పించానని, దీని కోసం రెండు చేతులెత్తి దండం పెట్టానని చెప్పారు. పవన్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. 40 ఏళ్ల సీనియారిటీ ఉన్నప్పటికీ టీడీపీ ఇప్పుడు పతనావస్థకు చేరిందని, అలాంటి పార్టీకి తానే అండగా నిలవాల్సి వస్తోందని అర్థం ధ్వనిస్తోంది. మరి ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి.

Tags:    
Advertisement

Similar News