బీజేపీ వల్ల నష్టపోయానంటున్న పవన్

పొత్తుల్లో మధ్యవర్తిత్వం చేస్తే ఏమవుతుందో తనకిప్పుడు అర్థమైందని అన్నారు పవన్. అయితే రాష్ట్ర భవిష్యత్తుకోసమే తాను త్యాగం చేశానని చెప్పారు.

Advertisement
Update:2024-03-14 16:53 IST

టీపీడీ-జనసేన కూటమిలో కాస్త ఆలస్యంగా చేరింది బీజేపీ. బీజేపీ చేరడం వల్ల జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ సీట్లలో మూడింటికి కోత పడింది. ఒక ఎంపీ స్థానం కూడా కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ కూటమిలో చేరడం వల్ల తాను ఆ మేరకు నష్టపోయానని చెబుతున్నారు పవన్. బీజేపీ కోసం మూడు అసెంబ్లీ సీట్లు త్యాగం చేశామన్నారాయన. జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన ఆయన.. పొత్తుల్లో మధ్యవర్తిత్వం చేస్తే ఏమవుతుందో తనకిప్పుడు అర్థమైందని అన్నారు. అయితే రాష్ట్ర భవిష్యత్తుకోసమే తాను త్యాగం చేశానని అంటున్నారు పవన్.

బాబు భ్రమల్లో పవన్..

జనసేనకు 24 సీట్లు కేటాయించిన టీడీపీ 151 స్థానాలు తన దగ్గరే ఉంచుకుంది. కొత్తగా కూటమిలో చేరిన బీజేపీకి టీడీపీ 10 స్థానాలు ఇవ్వలేదా..? అయితే కావాలనే ఓ ప్లాన్ ప్రకారం చంద్రబాబు నేను 7 త్యాగం చేస్తా, నువ్వు 3 త్యాగం చెయ్యి అంటూ పవన్ ని ఒప్పించారు, ఒకరకంగా భ్రమల్లోకి నెట్టేశారు. బాబు భ్రమలో ఉన్న పవన్ 3 అసెంబ్లీ, 1 ఎంపీ సీటుని బీజేపీకి త్యాగం చేశారు. కానీ నష్టం జరిగింది పవన్ కే అనే విషయం ఆయనకు అర్థం కాకపోవడమే ఇక్కడ విశేషం. చంద్రబాబు తెలివిగా అటుబీజేపీ, ఇటు జనసేన నుంచి కూడా మెజార్టీ సీట్లలో టీడీపీ నేతల్నే రంగంలోకి దింపుతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా వారు చంద్రబాబుకి మాత్రమే నమ్మినబంటుల్లా ఉంటారనడంలో అనుమానం లేదు.

నన్ను తిట్టినా పర్లేదు..

టికెట్లు రానివాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి తనను తిడతారని, వ్యక్తిగతంగా తిడితే తనకు పర్లేదని, కానీ, పొత్తుకు ఇబ్బంది కలిగితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు పవన్‌ కల్యాణ్. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ మరోసారి పొత్తుల గురించి తన విశాల హృదయం గురించి పవన్ గొప్పగా చెప్పుకున్నారు. పెద్ద మనసుతో తాను పొత్తు కుదిర్చి చివరకు తానే చిన్నబోయానని ఒప్పుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News