కోటంరెడ్డి విషయంలో హై డ్రామా.. వేటు వేసేందుకు వెయిటింగ్
నెల్లూరు రూరల్ నియోజకవర్గం విషయంలో హైడ్రామా నడుస్తోంది. కోటంరెడ్డిపై అధిష్టానం ముందుగా వేటు వేస్తుందా, లేక ఆయనే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారా..? ఈ రెండిటిలో ఏది ముందు జరుగుతుందనేదే ఇప్పుడు అసలైన చర్చ.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మధ్యాహ్నం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, సాయంత్రానికల్లా అక్కడ కొత్త ఇన్ చార్జ్ ని పార్టీ ప్రకటించింది. ఆయన విషయంలో జగన్ ఏమాత్రం లేట్ చేయలేదు. అంతకు ముందు కూడా ఆనం వ్యాఖ్యలు కలకలం రేపినా.. చర్యలు తీసుకునే విషయంలో వైసీపీ ఏమాత్రం సంకోచించలేదు. కానీ అదే జిల్లాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రభుత్వంపై పెద్ద నిందే వేశారు. రోజులు గడుస్తున్నా అధిష్టానం సైలెంట్ గానే ఉంది. ఇన్ చార్జిని ప్రకటించే విషయంలో కూడా వేచి చూసే ధోరణితోనే ఉంది. కారణం కోటంరెడ్డికి పార్టీతో ఉన్న అనుబంధమే. పార్టీ వేటు వేస్తే సింపతీతో బయటకు రావాలని చూస్తున్నారు కోటంరెడ్డి. తనకు తానే టీడీపీతో మిలాఖత్ విషయం బయటపెట్టుకుంటే ఆ తర్వాత వేటు వేయాలని చూస్తోంది పార్టీ. ఈ రెండిటిలో ఒకటి గ్యారెంటీ, కానీ ఏది ముందో ఏది వెనకో తేలాల్సి ఉంది.
కోటంరెడ్డికి ఏకైక ఆప్షన్..
నెల్లూరు రాజకీయాల్లో రెండురోజులుగా హైడ్రామా నడుస్తోంది. కోటంరెడ్డి అలక, అసంతృప్తితో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన పార్టీని వదిలిపెట్టి వెళ్తారని ఎవరూ ఊహించలేదు. ఫోన్ ట్యాపింగ్ లో బయటపడిన వ్యవహారాలతో పార్టీ టికెట్ ఈసారి దక్కకపోవచ్చని తేలిపోవడంతోనే కోటంరెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, అవమానాలు అంటూ.. ఓ పద్ధతి ప్రకారం ఆయన పార్టీపై నిందలు వేస్తూ వస్తున్నారు. వైఎస్ కుటుంబంలో మూడు తరాలతో అనుబంధం ఉన్న తనను పార్టీనుంచి బయటకు పంపిస్తారా అంటూ తాజాగా వ్యాఖ్యానించారు. పార్టీలో తన వర్గాన్నంతా పూర్తిగా తనవైపు తిప్పుకునే ఆలోచనలో ఉన్నారు.
కుటుంబంలో చిచ్చు పెడతారా..?
అదే సమయంలో ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ లో వైసీపీ ఇన్ చార్జ్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆనం విజయ కుమార్ రెడ్డి పేరు వినిపించినా, చివరి నిమిషంలో కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇది పార్టీ వ్యూహమా లేక కోటంరెడ్డి వ్యూహమా అనేది తేలాల్సి ఉంది. అధిష్టానం కొత్త నాటకానికి తెరలేపిందని, తనకి పోటీగా తన తమ్ముడి పేరు తెరపైకి తెచ్చిందని, కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తోందని, తమ్ముడికి టికెట్ ఇస్తే తాను పోటీ చేయబోనని కూడా శ్రీధర్ రెడ్డి అన్నట్టు తెలుస్తోంది.
మొత్తమ్మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గం విషయంలో హైడ్రామా నడుస్తోంది. కోటంరెడ్డిపై అధిష్టానం ముందుగా వేటు వేస్తుందా, లేక ఆయనే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారా..? ఈ రెండిటిలో ఏది ముందు జరుగుతుందనేదే ఇప్పుడు అసలైన చర్చ.