జగన్ మాటే శిరోధార్యం.. వెనక్కి తగ్గిన బోసు
రామచంద్రాపురం వ్యవహారంలో సీఎం జగన్ వ్యూహం ఫలించింది. తెగేదాకా లాగితే పార్టీకే నష్టమని భావించిన ఆయన సర్వే చేస్తామంటూ సంధి కుదిర్చారు.
రామచంద్రాపురం నియోజకవర్గం విషయంలో వైసీపీ గొడవ టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. వైసీపీ టికెట్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ఇస్తే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ తేల్చి చెప్పిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట మార్చారు. ఇప్పుడు జగన్ మాటే తనకు శిరోధార్యం అంటున్నారు. కార్యకర్తలు ఆ వేదన చెందడం వల్లే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. అది బాధాకరమైన విషయం అన్నారు. తీవ్రమైన పదాలు వాడినందుకు సీఎంకు తాను మీడియా సమక్షంలో క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఇకపై ఈ ఎపిసోడ్ ని ముగించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు బోసు.
సంధి ఎలా జరిగిందంటే..?
అటు అధిష్టానం కూడా మంత్రి చెల్లుబోయినకు టికెట్ ఖాయం చేసే విషయంలో కాస్త వెనక్కు తగ్గింది. స్థానిక పరిస్థితులపై సర్వే నిర్వహించి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో ఎంపీ బోసు సైలెంట్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పై నమ్మకం ఉందని వివరించారు. అధిష్టానం హామీని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని చెప్పారు. వారినుంచి మంచి నిర్ణయమే వస్తుందన్నారు.
కార్యకర్తలకోసం ఏదేనా చేస్తా..?
అయితే కార్యకర్తలకు అన్యాయం జరిగితే మాత్రం తాను నిలదీస్తూనే ఉంటానన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను జగన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. కార్యకర్తలు ఆవేదన చెందితే ఓదార్చాలిన బాధ్యత కూడా తనదేనన్నారు ఎంపీ.
మొత్తానికి రామచంద్రాపురం వ్యవహారంలో సీఎం జగన్ వ్యూహం ఫలించింది. తెగేదాకా లాగితే పార్టీకే నష్టమని భావించిన ఆయన సర్వే చేస్తామంటూ సంధి కుదిర్చారు. ఎన్నికల వేళ వైసీపీలో అంతర్గత కుమ్ములాటని చల్లార్చారు.