అటు జయహో బీసీ.. ఇటు ఇదేం ఖర్మ బీసీ

జయహో బీసీని టార్గెట్ చేస్తూ ఇదేం ఖర్మ బీసీని తెరపైకి తెస్తున్నారు. ఈనెల 5న రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ముందు, 6న నియోజకవర్గ కేంద్రాల్లో, 7వ తేదీన కలెక్టరేట్ల ముందు టీడీపీకి చెందిన బీసీ నేతలు ధర్నాలు చేస్తారు.

Advertisement
Update:2022-12-04 08:42 IST

విజయవాడలో ఈనెల 7న వైసీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ బహిరంగ సభ జరగబోతోంది. భారీ ఎత్తున ఈ సభను నిర్వహించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారు. బీసీలకు వైసీపీ ఏం చేసింది, ఏం చేయబోతోంది అనే విషయాలపైనే నాయకుల ప్రసంగాలు ఉంటాయని ఇదివరకే స్పష్టం చేశారు. బీసీ మంత్రులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. భారీ ఎత్తున బీసీలను సమీకరించాలని, సభను విజయవంతం చేయాలనుకుంటోంది వైసీపీ.

ఇదేం ఖర్మ బీసీ..

ఈ కార్యక్రమానికి పోటీగా టీడీపీ ఇదేం ఖర్మ బీసీని మొదలు పెట్టింది. వైసీపీ జయహో బీసీని టార్గెట్ చేసే విధంగా ఈనెల 5నుంచి మొదలై 7వ తేదీతో ఈ కార్యక్రమం పూర్తయ్యేలా టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. రాష్ట్రాన్ని రెడ్లకు పంచిన వైసీపీ.. జయహో బీసీ అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతోందంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.34 వేల కోట్లు దిగమింగి, రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు రాజ్యాధికారం దూరం చేసినందుకా 'జయహో బీసీ మహాసభ' అని ప్రశ్నిస్తున్నారు. బీసీలను మంత్రులను చేశానంటున్న జగన్‌, వారికి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వలేదని, పదవుల కక్కుర్తితో వైసీపీలోని బీసీ నాయకులు, మంత్రులు తమ సామాజికవర్గాల హక్కులను జగన్‌ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శిస్తున్నారు.

సీఎం దగ్గర నుంచి ప్రభుత్వ సలహాదారు, డీజీపీ, సీఎస్‌ వరకూ అందరూ కడప రెడ్లే కదా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. జయహో బీసీని టార్గెట్ చేస్తూ ఇదేం ఖర్మ బీసీని తెరపైకి తెస్తున్నారు. ఈనెల 5న రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ముందు, 6న నియోజకవర్గ కేంద్రాల్లో, 7వ తేదీన కలెక్టరేట్ల ముందు టీడీపీకి చెందిన బీసీ నేతలు ధర్నాలు చేస్తారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కకు మళ్లించారని, చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రాలు ఇస్తారు, నిరసన తెలియజేస్తారు.

బీసీలు చేసే నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం అడ్డుకుంటే మరింత రాద్ధాంతం చేయాలనేది టీడీపీ ఆలోచన. జయహో బీసీ అంటూనే, ఇక్కడ బీసీలను అరెస్ట్ చేస్తున్నారని, అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించే అవకాశం కోసం టీడీపీ వేచి చూస్తోంది. అందుకే జయహో బీసీ సభ రోజునే.. కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనకు సిద్ధమైంది. మరి ఏపీలో జయహో బీసీకి ఆదరణ దక్కుతుందా, ఇదేం ఖర్మ బీసీకి ఎక్కువ మైలేజీ వస్తుందా అనేది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News