సిట్టింగ్ లకు ఊరట.. జగన్ కీలక వ్యాఖ్యలు
"నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశా, ఇప్పుడు మీ వంతు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లండి." అని సూచించారు సీఎం జగన్.
"45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పేదవాడు బాగుపడాలంటే వైసీపీ తిరిగి గెలవాల్సిందే, మన ప్రభుత్వం మళ్లీ రావాల్సిందే. జరిగిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా, వివరంగా చెప్పగలిగితేనే విజయం సాధిస్తాం. నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశా. ఇప్పుడు మీ వంతు.. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లండి." అంటూ మంగళగిరిలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్. ‘మేం సిద్ధం- మా బూత్ సిద్ధం’ అనే పేరుతో జరిగిన ఈ సమావేశంలో జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయి పాజిటివ్ దృక్పథంతో మాట్లాడారు. ఏ ఒక్కరి పనితీరునీ వేలెత్తి చూపించలేదు, ఎవర్నీ మందలించలేదు, ఎవరికీ హెచ్చరికలు జారీ చేయలేదు. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో గెలవడమే ధ్యేయంగా పనిచేయాలని నేతలకు సూచించారు జగన్.
సిట్టింగ్ లకు ఊరట..
ఇప్పటి వరకు వైసీపీ విడుదల చేసిన జాబితాల్లో కొన్నిచోట్ల సిట్టింగ్ ల జాతకాలు తారుమారయ్యాయి. అటు-ఇటు స్థానాలు మారాయి. కొంతమంది కొత్తవారికి అవకాశమిచ్చారు, మరికొందరు సీనియర్లను పక్కనపెట్టారు. ఆ జాబితాల్లో లేని నియోజకవర్గాల నేతలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. తమకు టికెట్ ఖరారైనట్టా లేనట్టా అని ఆందోళన పడుతున్నారు. అలాంటి అనుమానాలేవీ పెట్టుకోవద్దని. ఇప్పటి వరకు విడుదలైన జాబితాలే ఫైనల్ అని తేల్చి చెప్పారు సీఎం జగన్. అంటే ఆయా జాబితాల్లో పేర్లు లేని నియోజకవర్గాల్లో సిట్టింగ్ లే వైసీపీ అభ్యర్థులని తేలిపోయింది. ఇన్ చార్జ్ లు ఉన్నచోట వారికే వైసీపీ టికెట్ ఖాయమని స్పష్టమైంది.
బూత్‌స్థాయిలో పార్టీని వీలైంత తొందరగా యాక్టివేట్ చేయాలని, ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఒక విశ్వసనీయ వ్యక్తిని నియమించాలని మీటింగ్ కి హాజరైన నేతలకు సూచించారు సీఎం జగన్. ఆ వ్యక్తి పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేయడంతోపాటు వారిని పర్యవేక్షించగలగాలని చెప్పారు. బూత్‌స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారుసార్లు కలవాలని, వాలంటీర్లు, గృహ సారథులను సమన్వయపరచుకుంటూ వారితో కలసి ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోవాలన్నారు. ప్రతి బూత్ బృందంలో 15 నుంచి 18 మంది బూత్ సభ్యులు ఉండేలా సిద్ధం కావాలన్నారు సీఎం జగన్.
మంచిని చెప్పండి..
ఎన్నికల వేళ ఎక్కడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు సీఎం జగన్. వైసీపీ హయాంలో జరిగిన మంచిని చెబితే చాలన్నారు. లబ్ది పొందిన ప్రతి గడపకు వెళ్లి మనం చేసిన మంచిని ఓట్లుగా మార్చుకోవాలని సూచించారు. పేదలకు మంచి చేశామని, ఇప్పుడు మీ మద్దతు మాకు అవసరమని చెప్పాలన్నారు. "2019లో 151 సీట్లు గెలుచుకున్నాం. అధికారంలోకి వచ్చాక ప్రజలకు పూర్తి స్థాయిలో మంచి చేశాం. అంటే కచ్చితంగా గతంకంటే ఎక్కువ సీట్లు రావాలి. ఈసారి 175కి 175 స్థానాలు గెలవాలి. 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలవాలి. ఆల్ ది బెస్ట్ అని" అంటూ తన ప్రసంగం ముగించారు సీఎం జగన్.